పబ్లిసిటీ కావాలంటే నగ్నంగా డ్యాన్స్ చెయండి!
రక్షణమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పణజి: గోవా మీడియాలోని ఓ వర్గంపై రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసం అనవసరంగా వాగడం కంటే సదరు మీడియా దుస్తులిప్పి నగ్నంగా డ్యాన్స్ చేయడం మేలు అని, అదే తాను సలహా ఇస్తానని పేర్కొన్నారు. ఉత్తర గోవాలోని సత్తారి సబ్ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియా తన పరిమితులను గుర్తించడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
'1968లో వాటర్‌గేట్ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్ (అమెరికా అధ్యక్షుడు) రిచర్డ్ నిక్సన్‌కు సలహాలు ఇస్తూ పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు అదే నిక్సన్ కోసం మరాఠీలో సంపాదకీయాలు రాస్తామంటే ఎలా? అతను అమెరికన్. కొందరు వ్యక్తులు తమ పరిమితులను గుర్తించడం లేదు. వారు తరచూ గోల చేస్తున్నారు. వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే.. దుస్తులు విప్పి నగ్నంగా నర్తించండి. అప్పుడు ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది' అని స్థానిక దినపత్రికపై ఆయన మండిపడ్డారు. వెయ్యికాపీలు కూడా అమ్ముడుపోని సదరు దినపత్రిక అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ పొందాలని తాపత్రయపడుతున్నదని ఎద్దేవా చేశారు.