దండుమైలారంలో ‘భూ మాయ’
► 38 ఎకరాల అటవీ భూమి అక్రమ రిజిస్ట్రేషన్
► ఇబ్రహీంపట్నం ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: తనిఖీలు జరుపుతున్న కొద్దీ రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా దండుమైలారం గ్రామ శివార్లలో 38 ఎకరాల అటవీ భూము లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి.. కాజేసినట్లు గుర్తిం చారు. దీనికి సంబంధించి ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ సలేహా ఖాదిర్‌ను గురువారం సస్పెండ్ చేశారు. దండుమైలారం గ్రామ శివార్లలోని సర్వే నంబర్ 36లో దాదాపు 3,200 ఎకరాల ప్రభుత్వ/అటవీ భూములు ఉన్నాయి. అయితే ఈ సర్వే నంబర్లోని 38 ఎకరాల అటవీ భూమిని పార్థసారథి, మరో 17 మంది వ్యక్తులు తమ భూమిగా చూపుతూ... గద్వాల విజయలక్ష్మి అనే మహిళ పేరిట ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు.
2007లో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ ద్వారా తమకు అక్కడ 2,000 ఎకరాల భూమి సంక్రమించిందని పార్థసారథి దస్తావేజులో పేర్కొన్నారు. అయితే తొలుత ఈ రిజిస్ట్రేషన్ దరఖాస్తు 2015 నుంచి దాదా పు ఏడాది పాటు ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాల యంలో పెండింగ్‌లోనే ఉంది. కానీ కొంతకాలం పాటు ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన సలేహా ఖాదిర్.. ఆ రిజిస్ట్రేషన్ తంతును పూర్తిచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ బాగోతాలను ప్రత్యేక బృందాలు వెలికితీస్తున్న క్రమంలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో.. సలేహా ఖాదిర్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యా యి. కాగా.. ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏడేళ్లుగా సలేహా సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె గతంలో బదిలీ అయినా.. ఓ మంత్రి ఒత్తిడి మేరకు ఉన్నతా ధికారులు ఆ బదిలీని నిలిపివేశారని తెలిసింది.