Dark room
-
15 ఏళ్ల నరకం నుంచి విముక్తి
ఆమెను బంధించిన కుటుంబ సభ్యుల అరెస్టు పణజి: పెళ్లయిన కొన్నాళ్లకే ఆమె జీవితం నరకంగా మారింది. భర్త చేసిన మోసానికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ప్రవర్తన బాగా లేదంటూ పుట్టినింటివాళ్లే ఆమెను చీకటిగదిలో బందించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు నలుగురిని అరెస్టు చేశారు. గోవాలోని కాండోలిమ్ గ్రామానికి చెందిన మహిళకు 15 ఏళ్ల కిందట ముంబయికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే అత్తారింటికి వెళ్లిన కొద్ది రోజులకే ఆమెకు అసలు నిజం తెలిసింది. తన భర్తకు ఇంతకు ముందే పెళ్లయిందని తెలుసుకొని మనోవేదనకు గురయింది. దీంతో పుట్టింటికి తిరిగి వచ్చేసి, జరిగిన మోసాన్ని తల్చుకుంటూ కుంగిపోయింది. దీంతో అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమెకు అండగా ఉండాల్సిన ఇద్దరు సోదరులు, వారి భార్యలు బాధితురాలిని చీకటి గదిలో పడేశారు. ఇటీవల ఆమెను చూసిన ఓ వ్యక్తి.. మహిళల హక్కులను కాపాడే ‘బైలాంచావో సాద్’ అనే ఎన్జీవోకు ఈ–మెయిల్ చేశాడు. సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మహిళను రక్షించారు. -
20 ఏళ్లుగా చీకటి గదిలో గోవా మహిళ
పనాజీ: అసలే ఆ మహిళ భర్త చేతిలో మోసపోయారు. ఆపై తన కష్టాలు చెప్పుకునేందుకు పుట్టింటికి వచ్చారు. పుట్టింటివారు చీకటి గదిలో ఆమెను బంధించారు. ఇక అంతే అక్కడితో ఆమె జీవితం రెండు దశాబ్దాలు నరకకూపంలో గడిచిపోయింది. చివరికి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను బయటి ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఈ ఘటన నార్త్ గోవాలో ఇటీవల వెలుగుచూసింది. నార్త్ గోవాలోని క్యాండోలిమ్కు చెందిన మహిళ 20 ఏళ్ల కిందట ముంబైకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. భర్తతో పాటు ముంబైలోని అత్తింటికి వెళ్లారు. కానీ తన భర్తకు అప్పటికే వివాహం జరిగిందని తెలుసుకుని ఆమె కుమిలిపోయారు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన తనకు కొన్ని రోజుల్లోనే చేదు అనుభవం ఎదురవుతుందని భావించలేదు. ఆపై కొన్ని రోజులకే భర్తపై ఆగ్రహంతో గోవాలోని తన పుట్టింటికి వచ్చారు. ఆమెను ఓదార్చి బాధను పంచుకోకపోగా, కుటుంబసభ్యులు ఆమె మానసిక స్థితిపై అనుమానపడ్డారు. ఓ చీకటి గదిలో ఆమెను బంధించారు. అసలే భర్త చేసిన మోసానికి ఎంతో ఆవేదన చెందిన మహిళ పుట్టింటి వారి చేష్టలకు బాహ్యప్రపంచంతో బంధం కోల్పోయింది. 20 ఏళ్లు చీకటిగదిలో గడిచిపోయాయి. నీళ్లు, ఆహారం మాత్రం ఆ గదిలోకి వెళ్లేవి. ఈ క్రమంలో గదికి ఉన్న కిటికీ ద్వారా మహిళను గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని ఫ్యామిలీని ప్రశ్నించి చీకటిగదిలోకి వెళ్లి చూసి షాక్ తిన్నారు. దాదాపు యాభైఏళ్లున్న ఓ మహిళ నగ్నంగా ధీనస్థితిలో పడి ఉన్నట్లు మహిళా పోలీసులు గుర్తించారు. ఆమెను ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి సోదరులను పోలీసులు ప్రశ్నించగా.. ముంబైకి నుంచి వచ్చాక తమ సోదరి ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ రూములో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరించారు. -
పదేళ్లుగా చీకటి గదిలోనే
మానసిక వ్యాధితో బాధపడుతున్న యువకుడు సింధనూరు టౌన్ : పదేళ్లుగా చీకటి గదిలోనే గడిపిన ఓ యువకుని ఉదంతం తాలూకాలోని తిప్పనహట్టి సమీపంలోని కల్యాణ హుడేవ్ గ్రామంలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దొడ్డనగౌడ, బసమ్మ దంపతుల పెద్ద కుమారుడు బసవరాజ్ పదేళ్లుగా మానసిక అస్వస్థతతో బాధపడుతూ ఇహలోకంలోని అన్ని భావాలను కోల్పోయాడు. ఎవరైనా మాట్లాడిస్తే కోపోద్రిక్తుడై ప్రతిస్పందించేవాడు. అతనిని పలు చోట్ల చూపించగా, నయం కాకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులు చీకటి గదిలో బంధీ చేశారు. ఈ విషయంపై బసవరాజ్ తల్లి బసమ్మను సంప్రదించగా, చెట్టంత కొడుకు ఇలా కావడం తనను ఎంతో బాధిస్తోందని వాపోయింది. చుట్టుపక్కల వారు ఈసడించుకోవడం కన్నా తన కుమారుడు గదిలో బంధీ కావడమే మేలని, అన్నింటికీ ఆ భగవంతునిపైనే భారం వేశానన్నారు. ఇదిలా ఉండగా గురువారం సీనియర్ ఆరోగ్య సహాయకుడు రంగనాథ గుడి తిప్పనహట్టి గ్రామాన్ని సందర్శించి ఆ యువకుడి కుటుంబంతో చర్చించారు. కుటుంబ సభ్యులు సహకరిస్తే బసవరాజ్‌ను తమ శాఖ తరఫున రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తామని బసవరాజ్ తల్లికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.