
15 ఏళ్ల నరకం నుంచి విముక్తి
ఆమెను బంధించిన కుటుంబ సభ్యుల అరెస్టు
పణజి: పెళ్లయిన కొన్నాళ్లకే ఆమె జీవితం నరకంగా మారింది. భర్త చేసిన మోసానికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ప్రవర్తన బాగా లేదంటూ పుట్టినింటివాళ్లే ఆమెను చీకటిగదిలో బందించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు నలుగురిని అరెస్టు చేశారు. గోవాలోని కాండోలిమ్ గ్రామానికి చెందిన మహిళకు 15 ఏళ్ల కిందట ముంబయికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే అత్తారింటికి వెళ్లిన కొద్ది రోజులకే ఆమెకు అసలు నిజం తెలిసింది.
తన భర్తకు ఇంతకు ముందే పెళ్లయిందని తెలుసుకొని మనోవేదనకు గురయింది. దీంతో పుట్టింటికి తిరిగి వచ్చేసి, జరిగిన మోసాన్ని తల్చుకుంటూ కుంగిపోయింది. దీంతో అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమెకు అండగా ఉండాల్సిన ఇద్దరు సోదరులు, వారి భార్యలు బాధితురాలిని చీకటి గదిలో పడేశారు. ఇటీవల ఆమెను చూసిన ఓ వ్యక్తి.. మహిళల హక్కులను కాపాడే ‘బైలాంచావో సాద్’ అనే ఎన్జీవోకు ఈ–మెయిల్ చేశాడు. సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మహిళను రక్షించారు.