ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!
చిలకలగూడ: ఆమె కోట్ల రూపాయలకు అధిపతి.. కానీ దేవుని ప్రసాదంతో కడుపు నింపుకోవాల్సిన దైన్య స్థితి. చిన్నతనంలో తన చేతి గోరుముద్దలు తిన్న బిడ్డలు... వృద్ధాప్యంలో ఆదరించకపోవడంతో పదిహేనేళ్లుగా ఆలయం చెంతనే ఆశ్రయం పొందుతోంది. కష్టాలు భరించలేని ఆ తల్లి చివరకు తనకు రావాల్సిన ఆస్తి కోసం కొడుకులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె మెట్టుగూడకు చెందిన కిమాబాయి పునేరియా (72). బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన ద్వారకదాసు, కిమాబాయి పునేరియాలు భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు.
తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తితోపాటు వ్యాపారంలో రూ.కోట్ల విలువైన చర, స్థిరాస్థులను సంపాదించిన ద్వారకదాసు 2001లో మృతిచెందాడు. అప్పటికే భార్య కిమాబాయితో పాటు బిడ్డలకూ ఆస్తిని సమానంగా పంచి పెట్టాడు. భర్త మరణంతో కిమాబాయికి సమస్యలు మొదలయ్యాయి. ఒత్తిడి చేసి ఆస్తిని చేజిక్కించుకున్న కుమారులు ఆనక అమ్మ ముఖం చూసేందుకు నిరాకరించారు. కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆ తల్లి యాదగిరిగుట్టకు వెళ్లి దైవసేవలో గడుపుతోంది. భక్తులు పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకుంటోంది. కుమారులు జల్సాలు చేస్తుంటే...రూ.కోట్లకు అధిపతినైన తానెందుకు కష్టాలు పడాలని భావించింది.
తన ఆస్తి ఇవ్వాలని కోరుతూ మెట్టుగూడలో కుమారులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు బుధవారం సాయంత్రం ధర్నాకు దిగింది. ‘నా ఆస్తి ఇస్తే... ఇటువంటి కుమారుల చేతిలో బాధ పడుతున్న తల్లుల కోసం ఏర్పాటు చేసే వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాలకు విరాళంగా అందజేస్తానని కిమాబాయి మీడియాకు తెలిపింది. «సన్నిహితుల సలహాతో ధర్నా విరమించి... కుమారులపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని ఆస్తులపై వివాదం కోర్టులో పెండింగ్లో ఉందని... కొంతమంది కావాలనే తమ తల్లితో కలిసి ఈ విధంగా చేస్తున్నారని ఆమె కుమారులు తెలిపారు.