Dasari Narayana Ra
-
దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించి, శతాధిక చిత్ర దర్శకునిగా... అనుపమాన దార్శకునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులు గడించిన దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ... వారిలో స్ఫూర్తిని నింపేందుకు "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి పట్టం కట్టి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు. దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు - ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షకార్యదర్శులుగా ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆడిటర్ గా, ఆర్ధిక సలహాదారుగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా మే 5న నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" జ్యురీ మెంబర్స్ తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రభు, అప్పాజీలతోపాటు... తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ... "దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న" పురస్కారాలు ప్రదానం చేయనున్నాం. ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు నడుం కట్టిన సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నాను" అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాసరి భౌతికంగా దూరమై ఏడేళ్లు కావస్తున్నా ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బి.ఎస్.ఎన్. సూర్యనారాయణకు అభినందనలు" అన్నారు. బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ... "దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించాం. కరోన కారణంగా కంటిన్యూ చేయలేకపోయాయాం. ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం" అన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... "దురదృష్టవశాత్తూ మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి. అలక్ష్యం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడైన దాసరి పేరిట అవార్డ్స్ ఇస్తుండడం ఎంతైనా అభినందనీయం" అన్నారు. ప్రభు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఒకే ఒక్కడు దర్శకరత్న డాక్టర్ దాసరి. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు యావత్ చిత్ర పరిశ్రమ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను" అన్నారు. ధీరజ అప్పాజీ మాట్లాడుతూ... "అవార్డ్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం తనకు "లైఫ్ టైమ్ అచీవ్మెంట్"లాంటిదని పేర్కొన్నారు. -
‘పరమవీరచక్ర చేయడం నా అదృష్టం’
దాసరి జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు శుక్రవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ‘దాసరి గారు పరిశ్రమ కష్టాలను తన ఇంట్లో కష్టాలుగా భావించేవారు. దాసరి గారితో ఎప్పుడో సినిమా చేయాలి కానీ, ఆయన తన 150వ సినిమాగా పరమ వీర చక్ర చేయడం నా అదృష్టం. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా, కార్మికుడిగా ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయ’ని బాలకృష్ణ అన్నారు. ‘ దాసరి గారికి దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న అవార్డులు ఇవ్వాలని పార్లమెంట్లో పోరాడుతామ’ని ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. దర్శక దిగ్గజం, నిర్మాత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు 71వ జయంతి సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందించింది. దాసరి జయంతిని డైరెక్టర్స్ డేగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని.. దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, సి.కల్యాణ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భౌతికంగా ఆయన దూరమైనా.. ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఈ సందర్భంగా ప్రకటించింది. దాసరి జయంతి వేడుకలను నేడు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో నిర్వహించనున్నారు. ఇక పలువురు దర్శకులు, సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ తమ సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యుడు, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ద్రోణాచార్యుడు , సినిమా ఇంటికి పెద్ద, దాసరి నారాయణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆయన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని.. ఇండస్ట్రీలో ఎందరికో మార్గదర్శి అని దర్శకుడు శీనువైట్ల పేర్కొన్నారు. ‘అందరం ఇక్కడే ఉన్నాం. కానీ ఆయనలేరు. దాసరి నారాయణ రావు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. -
ఆ పేరు వింటే ప్రాణం లేచొస్తుంది - దాసరి
‘దేవదాసు’ అనే పేరు వింటే నా ప్రాణం లేచొస్తుంది. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా అది. దేశవ్యాప్తంగా 9 సార్లు తెరకెక్కిన కథ ‘దేవదాసు’. అలాంటి టైటిల్‌తో మళ్లీ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. తనీష్, చాందిని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. వి.ఎస్.రామిరెడ్డి నిర్మాత. గణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించి ఏరాసు ప్రతాపరెడ్డికి ఇచ్చారు. దాసరి మాట్లాడుతూ-‘‘‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మూగవాడిగా తనీష్ అద్భుతంగా నటించాడు. కొత్త హీరోలు, దర్శకులు కష్టపడి సినిమాలు చేసినా... సరైన సమయంలో విడుదల చేసుకోలేకపోతున్నారు. ప్రతి పండుగకూ సినిమా థియేటర్లను కొన్ని కుటుంబాలు కబ్జా చేసి, చిన్న సినిమాలకు స్థానం లేకుండా చేస్తున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి వినోదభరితంగా సినిమా ఉంటుందని, త్వరలోనే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను ఆద్యంతం అలరించే సినిమా ఇదని తనీష్ అన్నారు -
శ్రమజీవి శ్రీహరి
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు సినీప్రపంచంలో రియల్ హీరోగా సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు శ్రీహరి శ్రమజీవి. సినీ నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో ఎదిగారు. ఆయన పక్కా హైదరబాదీ. నగరంలోనే పుట్టి పెరిగారు. చిన్నాపెద్దా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారు. ముఖ్యంగా శ్రీహరన్నగా సిటీలోని పహిల్వాన్లకు చిరపరిచితులు. దేహదారుఢ్యంపై మొదటినుంచి ఆసక్తి ఉన్న శ్రీహరి మొదట నగరంలోని బాలానగర్‌లో ఓ జిమ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక యువతకు అందులో శిక్షణ ఇచ్చేవారు. సినిమాల్లో నటించాలనే అకాంక్షతో మొదటి నుంచి కూడా తన శరీరాకృతిపై శ్రద్దచూపేవాడు. నిత్యం వ్యాయామం చేస్తూ జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొనేవాడు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు దృష్టిలో పడడంతో ఆయన తన బ్రహ్మనాయుడు చిత్రంలో శ్రీహరికి అవకాశమిచ్చారు. సికింద్రాబాద్‌లో విద్యాభ్యాసం కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా మల్లకుర్లు గ్రామానికి చెందిన సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బాలానగర్‌లో స్థిరపడ్డారు. వీరి రెండో కుమారుడు శ్రీహరి. సత్యనారాయణ హెచ్ఏఎల్లో సివిల్‌కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. శ్రీహరి బోయిన్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలో పదవ తరగతి వరకు చదివారు. సికింద్రాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియెట్, సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రాంగణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. నిజాం కళాశాలలో పీజీ చేశారు. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయకారిగా ఉండేందుకు చిన్నప్పుడు స్కూలుకు వెళ్తూనే ఇళ్లల్లో పాల ప్యాకెట్లు వేసేవారు. స్కూటర్ మెకానిక్ షెడ్డులో కూడా పనిచేశారు. కూతురు సమాధి పక్కనే.. బాచుపల్లి గ్రామంలో శ్రీహరికి ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులోనే శ్రీహరి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీహరి ఏకైక కూతురు అక్షర అంత్యక్రియలను కూడా బాచుపల్లిలోనే నిర్వహించారు. కూతురి మృతి తరువాత అక్షర పేరుమీద ఒక ఫౌండేషన్‌ను శ్రీహరి స్థాపించారు. ఫౌండేషన్ తరఫున రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న అనంతారం, లక్ష్మాపూర్ గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాం ట్లను ఏర్పరిచి తాగునీటి వసతి కల్పించారు. ఆ గ్రామాల ప్రజలు శ్రీహరి అకాల మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీహరి అకాల మరణంతో సినీ పరిశ్రమ కూడా దిగ్బ్రాంతికి లోనైంది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు, కార్మికులు గుర్తుచేసుకున్నారు. నెరవేరని కల సినీనటుడిగా తెలుగు ప్రజల హృదయాలలో చోటు సంపాదించిన రియల్‌స్టార్ శ్రీహరి రాజకీయ కల మాత్రం నెరవేరలేదు. పలుమర్లు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. దివంగత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీహరి ప్రచారం కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరుకున్నారు. శ్రీహరి యువసేన పేరుతో స్థానికంగా ఆయనకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.