ఆ పేరు వింటే ప్రాణం లేచొస్తుంది - దాసరి
‘దేవదాసు’ అనే పేరు వింటే నా ప్రాణం లేచొస్తుంది. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా అది. దేశవ్యాప్తంగా 9 సార్లు తెరకెక్కిన కథ ‘దేవదాసు’. అలాంటి టైటిల్‌తో మళ్లీ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు.
తనీష్, చాందిని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. వి.ఎస్.రామిరెడ్డి నిర్మాత. గణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించి ఏరాసు ప్రతాపరెడ్డికి ఇచ్చారు. దాసరి
మాట్లాడుతూ-‘‘‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మూగవాడిగా తనీష్ అద్భుతంగా నటించాడు. కొత్త హీరోలు, దర్శకులు కష్టపడి సినిమాలు చేసినా... సరైన సమయంలో విడుదల చేసుకోలేకపోతున్నారు. ప్రతి పండుగకూ సినిమా థియేటర్లను కొన్ని కుటుంబాలు కబ్జా చేసి, చిన్న సినిమాలకు స్థానం లేకుండా చేస్తున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి వినోదభరితంగా సినిమా ఉంటుందని, త్వరలోనే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను ఆద్యంతం అలరించే సినిమా ఇదని తనీష్ అన్నారు