ప్రతి సంవత్సరం దర్శకరత్న డి.ఎన్.ఆర్ ఫిల్మ్ అవార్డ్స్
శిల్పకళావేదికలో వేడుకలకు ఏర్పాట్లు
దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించి, శతాధిక చిత్ర దర్శకునిగా... అనుపమాన దార్శకునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులు గడించిన దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ... వారిలో స్ఫూర్తిని నింపేందుకు "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి పట్టం కట్టి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు.
దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు - ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షకార్యదర్శులుగా ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆడిటర్ గా, ఆర్ధిక సలహాదారుగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్, శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా మే 5న నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" జ్యురీ మెంబర్స్ తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రభు, అప్పాజీలతోపాటు... తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
తమ్మారెడ్డి మాట్లాడుతూ... "దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న" పురస్కారాలు ప్రదానం చేయనున్నాం. ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు నడుం కట్టిన సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నాను" అన్నారు.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాసరి భౌతికంగా దూరమై ఏడేళ్లు కావస్తున్నా ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బి.ఎస్.ఎన్. సూర్యనారాయణకు అభినందనలు" అన్నారు.
బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ... "దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించాం. కరోన కారణంగా కంటిన్యూ చేయలేకపోయాయాం. ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం" అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... "దురదృష్టవశాత్తూ మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి. అలక్ష్యం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడైన దాసరి పేరిట అవార్డ్స్ ఇస్తుండడం ఎంతైనా అభినందనీయం" అన్నారు.
ప్రభు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఒకే ఒక్కడు దర్శకరత్న డాక్టర్ దాసరి. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు యావత్ చిత్ర పరిశ్రమ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను" అన్నారు. ధీరజ అప్పాజీ మాట్లాడుతూ... "అవార్డ్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం తనకు "లైఫ్ టైమ్ అచీవ్మెంట్"లాంటిదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment