దాసరిగారు మనందరిలో జీవించే ఉన్నారు
‘‘చుట్టూ ఉన్నవారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం ఉన్నవారు మా గురువుగారు దాసరి నారాయణరావు. తండ్రి ప్రారంభించిన ఈ సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. రఘునాథ్ బాబు కొనసాగించడం నిజంగా హ్యాట్సాఫ్’’ అని దర్శకుడు–నటుడు–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. డాక్టర్ దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ‘నీడ’ తరపున దాసరి కుమార్తె హేమాలయా కుమారి, అల్లుడు డా. రఘునాథ్‌బాబు పలువురికి స్కాలర్షిప్లు అందించారు.
కొంకపురి నాటక కళాపరిషత్‌కు 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువునే ఆస్తిగా ఇస్తున్నారు. తన దగ్గర పని చేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ, వారి పిల్లల చదువులకు గురువుగారి ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో జీవించే ఉన్నారు.. ఉంటారు’’ అన్నారు. ‘‘గురువుగారితో నాది ఎన్నో ఏళ్ల అనుబంధం.
ఆయన వద్దకు సహాయం కోరి వచ్చే వారిలో ఫ్రాడ్స్ ఉన్నప్పటికీ, వారిని పెద్ద మనసుతో క్షమించి సాయం చేసిన అద్భుతమైన సేవామూర్తి దాసరి నారాయణరావు. ఆయన అందించే స్కాలర్షిప్లను తమ్మారెడ్డి భరద్వాజ, నేను ఫైనలైజ్ చేసేవాళ్లం’’ అన్నారు రేలంగి నరసింహారావు. ‘‘సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నాం అంటుంటారని, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, స్థలాలు కావాలని అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు. నిజమే కావొచ్చు కానీ మా గురువు దాసరిగారు నిజంగానే సేవ చేశారు.
తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కీర్తి అజరామరం. మా గురువుగారి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికీ ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతోమందికి దాన ధర్మాలు చేశారు. మా దృష్టిలో ఆయన ఎప్పటికీ దేవుడే. దాసరిగారి సేవలను ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లతోపాటు సినీరంగ ప్రముఖులు ధవళ సత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.