కడసారి చూడకపోవడం బాధ కలిగిస్తున్నది: చిరంజీవి
హైదరాబాద్: విఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కడసారి చూపు తనకు దక్కకపోవడం ఎంతో బాధ కలిగిస్తున్నదని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన దాసరి నారాయణరావు సంతాపసభలో చిరంజీవి మాట్లాడారు. విదేశాల్లో ఉండటం వల్ల దాసరి చనిపోయినప్పుడు తాను రాలేకపోయానని, అది తన జీవితంలో తీవ్ర అసంతృప్తి కలిగించే విషయమని అన్నారు. అయితే, దాసరి పాల్గొన్న చివరి రెండు బహిరంగ సభలు తమకు సంబంధించినవే కావడం కొంత ఊరట కలిగించిందని చెప్పాడు.
తన సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ-రిలీజ్ వేడుకలో దాసరి పాల్గొన్నారని, ఇదే ఆయన పాల్గొన్న కడసారి బహిరంగ సభ అని అన్నారు. అంతేకాకుండా మే 4న అల్లు రామలింగయ్య అవార్డు అందజేసినప్పుడు ఆయన కడసారి మీడియాతో మాట్లాడారని, తమను పక్కన ఉంచుకొని ఆయన ఆఖరిసారిగా మీడియాతో మాట్లాడటం తనకు తృప్తినిచ్చిందని అన్నారు. కనీసం ఆ రకంగానైనా ఆయన ఆశీస్సులు తమకు దక్కాయని చెప్పారు.
ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత దాసరిని చూసి తాను మాట్లాడలేకపోయానని, కానీ అలాంటి సమయంలోనూ ఆయన నీ సినిమా స్కోరు ఎంత అని ఆయన అడిగారని, హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందని తాను చెప్పగానే చిన్నపిల్లల మాదిరిగా విజయసంకేతం చూపి చప్పట్లు కొట్టారని గుర్తుచేసుకున్నారు. అనంతరం తమ ఇంటికి తీసుకెళ్లి దగ్గరుండి భోజనం వడ్డించి.. పితృవాత్యల్సం చూపించారని చెప్పారు. దాసరి మన మధ్య లేకపోవడం చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు అని, ఆయన కార్మికుల కష్టాల పరిష్కారం కోసం ఎంతో చిత్తశుద్ధితో నిరంతరం కష్టపడ్డారని అన్నారు.