కాపు నేతల భేటీకి దాసరి, చిరంజీవి
శ్రీకాకుళం : ఈనెల 11న రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి కాపు నేతలు సమావేశమవుతారని జేఏసీ నేతలు తెలిపారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కళ్యాణమండపంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం మంగళవారం జరిగింది. జేఏసీ ప్రతినిధి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ 11న జరిగే భేటీకి కాపు ప్రముఖ నేతలు దాసరి నారాయణరావు, చిరంజీవి, పలువురు ఐఏఎస్ అధికారులు హాజరవుతారని తెలిపారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చాలని కోరుతూ 70 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఈ కులాలన్నీ బీసీలుగా పరిగణిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఓసీలుగా గుర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కులాలను బీసీల్లో చేర్పించేందుకు గత కొన్నేళ్లుగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తున్నారన్నారు. ఆయన దీక్షను విరమింపచేసేందుకు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని, ఆ హామీల కోసం గడువు కూడా కోరిందన్నారు. ఆగస్ట్ నెలతో గడువు ముగిసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకు కృషి చేయకపోవడం దారుణమన్నారు.