ఆ మార్కెట్లోనూ జియోదే హవా..
సాక్షి, న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఓ వైపు టెల్కోలకు చుక్కులు చూపిస్తుండగా... ఇటు అదే సంస్థకు చెందిన వైఫై రూటర్ జియోఫై కూడా మార్కెట్లో దూసుకుపోతుంది. డేటా కార్డు మార్కెట్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నట్టు సైబర్ మీడియా రీసెర్చ్( సీఎంఆర్) వెల్లడించింది. రెండో స్థానంలో ఉన్న హువాయ్ కేవలం 3 శాతం మార్కెట్ షేరు మాత్రమే కలిగిఉందని సీఎంఆర్ చెప్పింది. జనవరి-మార్చి క్వార్టర్లో డేటా కార్డుల షిప్మెంట్లు 3.4 మిలియన్ల నుంచి 4 మిలియన్లు ఎగిసి 16 శాతం వృద్ధిని నమోదుచేశాయని సైబర్ మీడియా రీసెర్చ్ తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది డేటా కార్డు మార్కెట్ ఏడింతలు విస్తరించినట్టు కూడా పేర్కొంది.
ఈ క్రమంలో జియో అందిస్తున్న ఉచిత డేటా సర్వీసులు, మి-ఫై డేటా కార్డులు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న మొబైల్ హాట్స్పాట్లు దీని పాపులారిటీని పెంచుతున్నాయని సీఎంఆర్ తెలిపింది. జియో ఫై రూటర్ కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లకు ఇటీవలే రూ.1,999 విలువైన డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌ను రిలయన్స్ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి-మార్చి క్వార్టర్లో కూడా దీని షేరు 90 శాతముంది. జియో ఫై డివైజ్‌లు ఇటు హోమ్ రూటర్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లో జియో డేటా సర్వీసులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది.