ఇంటర్నెట్ రేట్లలో 90శాతం కోత?
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ డిజిటల్ ఇండియా చొరవలో భాగంగా ప్రజలందరికీ వై-ఫై నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అన్వేషణ ప్రారంభించింది. ప్రజా వై-ఫై నెట్ వర్క్ ద్వారా బ్రాడ్ బాండ్ యాక్సెస్ ను విస్తరించేందుకు ప్రజల అభిప్రాయాలను ట్రాయ్ కోరుతోంది. టెలికాంయేతర కంపెనీలను కూడా ఈ పబ్లిక్ వై-ఫై ఏర్పాటులో భాగమయ్యేలా చేయాలని భావిస్తోంది. ఇంటర్నెట్ రేట్లలో 90శాతం కోత విధించేందుకు తక్కువ ధరలకే వై-ఫై యాక్సెస్ సదుపాయాలను కల్పించాలని యోచిస్తోంది. అదేవిధంగా డేటా స్పీడులను కూడా ట్రాయ్ పెంచనుంది. నియంత్రణాపరమైన అడ్డంకులు, లైసెన్సింగ్ పరిమితులు, వ్యాపార విధానాలు వంటి వాటిపైన ప్రజాభిప్రాయాలను ఆగస్టు 10లోపు తెలియజేయొచ్చని ట్రాయ్ పేర్కొంది.
ప్రజా వై-ఫై నెట్ వర్క్స్ అంటే కేవలం లైసెన్సుడ్ సంస్థ నెలకొల్పిన వై-ఫై హాట్ స్పాట్ మాత్రమే పరిమితం కాకుండా..చిన్నస్థాయి వ్యాపారవేత్తలు వై-ఫై నెట్ వర్క్ ను వినియోగించుకునేలా ఈ హాట్ స్పాట్ ను నెలకొల్పవచ్చని ట్రాయ్ తెలిపింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా వై-ఫై నెట్ వర్క్ ను విస్తరించేందుకు వాణిజ్య పరమైన విధానాలను ప్రజలు సూచించవచ్చని ట్రాయ్ కోరుతోంది. కేంద్ర మూడో పార్టీ ప్రామాణీకరణ ఎక్కడ అవసరమో అక్కడ "హబ్-బేస్డ్ మోడల్" కోసం కూడా ట్రాయ్ ప్రజల సలహాలను అభ్యర్థిస్తోంది.
వై-ఫై నెట్ వర్క్ ద్వారా అందించే ఎంబీ ధర కేవలం 2పైసలే అవుతుంది. ప్రస్తుతం 2జీ, 3జీ, 4జీ సెల్యులార్ నెట్ వర్క్ లపై ఎంబీ ధర 23పైసలుగా ఉంది. దీంతో మొబైల్ డేటాతో పోలిస్తే, వై-ఫై ద్వారా అందించే డేటా చార్జీలు ఒకింట పది వంతులు తగ్గుతాయని ట్రాయ్ పేర్కొంటోంది. సరసమైన ధరలోనే వినియోగదారులకు వై-ఫై నెట్ వర్క్ లను ట్రాయ్ అందించనుంది.