తల్లిదండ్రుల బాధ చూడలేక కుమారుడి ఆత్మహత్య
దుబ్బాక : కుమార్తె పెళ్లి, వ్యవసాయ పొలంలో వేసిన బోర్లకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో మదనపడుతున్న తల్లిదండ్రుల బాధ చూడలేక కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుబ్బాక మండలం నగరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కోనాపురం రాజవ్వ, దుబ్బ రాజయ్య దంపతులకు స్వామి, రమేష్, చామంతి సంతానం. స్వామికి పెళ్లి కావడంతో వేరుగా ఉంటున్నాడు. ఏడాది కింద కుమార్తె చామంతికి అప్పు చేసి వివాహం చేశారు. రమేష్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే సెలవు దినాల్లో అప్పుడప్పుడూ తండ్రికి వ్యవసాయంలో చేదోడు, వాదోడుగా ఉండేవాడు. కాగా రాజయ్య తనకున్న 1.20 ఎకరాల్లో రెండు బోర్లు వేశాడు. చుక్క నీటి బొట్టు రాలేదు.
సాగు చేసిన వరి చేను కూడా నీళ్లు లేక కళ్ల ముందే ఎండిపోయింది. కుమార్తె వివాహానికి, వేసిన బోర్లకు కలిసి రూ. 2 లక్షల వరకు అప్పు అయ్యింది. వరి పంట చేతికి వస్తే అప్పు తీర్చ వచ్చన్న దీమా కూడా లేకుండా పోయింది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో రాజవ్వ, రాజయ్య దంపతులు ఇంట్లో తరచూ మదనపడుతుండే వారు. ఈ విషయాన్ని గమనించిన కుమారుడు రమేష్ (21) కలత చెందాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టంత ఎదిగిన కొడుకు కళ్లముందే కూలిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అప్పుల పాలైన రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ వార్డు సభ్యులు శ్రీనివాస్, ఎల్కపల్లి రాంచంద్రం, ఉడత మల్లేశం, సిద్దిరాములు ప్రభుత్వాన్ని కోరారు.