గూఢచార సంస్థల లోగుట్టు!
ముస్లింలను సంస్థలో చేర్చుకోరాదని ‘రా’ ఒక విధానంగా పెట్టుకున్నట్టు పదేళ్ల క్రితం ‘ఔట్లుక్’ మేగజైన్ వెల్లడించింది. ఆ సంస్థలో ఉండే 15,000మంది సిబ్బందిలో ఒక్కరు కూడా ముస్లింలు లేరు. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ కథనాన్ని వెలువరించేటపుడు ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్‌తో మాట్లాడింది. ‘సంస్థలో ముస్లింలను కలిసినట్టు తనకు జ్ఞాపకం లేద’ని ఆయనన్నారట. అంతేకాదు... ‘సంస్థలో ముస్లింలు లేకపోవడమంటే అదొక లోపంకిందే లెక్క.
పాకిస్తాన్లో ఉంటున్న ఒక భారతీయ పౌరుడిపై రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(దీన్ని ‘రా’ అని పిలుస్తారు) గూఢచారి అన్న ఆరోపణలు వచ్చాయి. సెల్ఫోన్లో తన కుటుంబంతో మరాఠీలో మాట్లాడాక ఆయనను పట్టుకున్నట్టు పాకిస్తాన్ నుంచి వస్తున్న కథనాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చే కాల్స్‌పై నిఘా ఉంటుంది గనుక అతన్ని గుర్తించి పట్టుకున్నారు. ఆయన దగ్గర భారత పాస్‌పోర్టు కూడా ఉంది. నకిలీ పాస్‌పోర్టులు కలిగి, ఉన్నతస్థాయి శిక్షణ పొందివుండే సినిమాల్లోని గూఢచారికి ఇది భిన్నంగా కనిపిస్తోంది.
ఇప్పుడు పట్టుబడ్డాయన నిజమైన ‘రా’ గూఢచారి అని తేలిన పక్షంలో నేను నిజంగా ఆశ్చర్యపోతాను. ఎందుకంటే ‘రా’ ఏజెంట్లు సీఐఏ, మొస్సాద్, ఐఎస్ఐ ఏజెంట్ల మాదిరే సాధారణంగా దౌత్య కార్యాలయాల్లో దౌత్యపరమైన పాస్ పోర్టులతో నియమితులవుతారు. ఇప్పుడు మన జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ ఆ పద్ధతిలోనే పాకిస్తాన్లో పనిచేశారని చదివాను. అయితే నాకు తెలిసినంతవరకూ ఆయన ‘రా’లో కాక ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉండేవారు. ఐబీ అనేది అంతర్గత గూఢచర్య సంస్థ. అది దేశ పౌరులపైనే ప్రధానంగా నిఘా ఉంచుతుంది. మర్యాదపూర్వకంగా చెప్పాలంటే అది దేశంలోని కార్యకలాపాలపై గూఢచర్యం నెరపుతుంది. దోవల్ ఐబీ అధికారి అయినప్పుడు ఆయన పాకిస్తాన్లో ఏం చేసేవారు? నాకు సరిగా తెలీదు...ఎందుకంటే ఈ రెండు సంస్థల గురించీ వదంతుల ద్వారానే తప్ప వాస్తవాల ద్వారా తెలిసే అవకాశం లేదు.
కొన్నిసార్లు ‘రా’ చీఫ్‌లకు కూడా ఆ సంస్థలో ఏం జరుగుతున్నదో తెలియదు. ముస్లింలను సంస్థలో చేర్చుకోరాదని ‘రా’ ఒక విధానంగా పెట్టుకున్నట్టు పదేళ్ల క్రితం ‘ఔట్లుక్’ మేగజైన్ వెల్లడించింది. ఆ సంస్థలో ఉండే 15,000మంది సిబ్బందిలో ఒక్కరు కూడా ముస్లింలు లేరు. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ కథనాన్ని వెలువరించేటపుడు ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్‌తో మాట్లాడింది. ‘సంస్థలో ముస్లింలను కలిసినట్టు తనకు జ్ఞాపకం లేద’ని ఆయనన్నారట. అంతేకాదు... ‘సంస్థలో ముస్లింలు లేకపోవడమంటే అదొక లోపంకిందే లెక్క. ముస్లింలు లేరంటే వారిని తీసుకోవడానికి అయిష్టతతో ఉన్నట్టే అనుకోవాలి. అంతమంది ముస్లింలు దొరకడం కూడా కష్టమే’ అని దౌలత్ చెప్పారు. మరో ‘రా’ అధికారి గిరీష్ చంద్ర సక్సేనా మాట్లాడుతూ ‘నిఘా సమాచార సేకరణలో ముస్లిం అధికారుల అవసరం ఎంతో ఉంది. ఉర్దూ లేదా అరబిక్ పరిజ్ఞానం ఉన్నవారు చాలా తక్కువ.
ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. అవసరం అంత తీవ్రమైనది అయినప్పుడు అది లోపం కిందే లెక్క. అలాంటపుడు వారిని ఎందుకు తీసుకోకూడదన్నది నాకు అర్ధంకాని విషయం. ట్రాక్-2 దౌత్యం(ప్రచ్ఛన్న దౌత్యం) చేసినవాడిగా నేను కొంతమంది మాజీ ఐఎస్ఐ చీఫ్‌లను కలిశాను. అందులో అసద్ దుర్రానీ ఒకరు. ఆయనా, నేనూ కొన్నేళ్లు ఒకే పత్రికకు వ్యాసాలు రాయడం చేత మా ఇద్దరికీ పరిచయం ఉంది. లాహోర్‌కు సమీపంలో ఉండే హరప్పాను నేను కొన్నేళ్లక్రితం సందర్శించినప్పుడు ఐఎస్ఐ గురించి కాస్త అర్ధమైంది. ఇప్పటికీ ఎంతో అద్భుతంగా పరిరక్షిస్తున్న సింధులోయ నాగరికతను చూడటానికి నేను అక్కడికి వెళ్లాను. అంతకు చాలా ఏళ్లకు ముందు తొలిసారి నేను అక్కడికి వెళ్లాను. కౌంటర్లో ఉండే వ్యక్తి స్థానికుల దగ్గర వసూలు చేసే మొత్తం కంటే విదేశీయుల దగ్గర ఎక్కువ వసూలు చేసి టికెట్లు ఇస్తున్నాడు. నేను స్థానికుణ్ణి కాదని మీరెలా చెప్పగలరని నేను అతన్ని ప్రశ్నించినప్పుడు ‘యహా కోయీ పాకిస్తానీ నహీ ఆతే’(ఇక్కడికి పాకిస్తానీయులెవరూ రారు) అని జవాబిచ్చాడు.
ఈ పర్యాయం నేను టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లినప్పుడు నాకు లోకల్‌కు సంబంధించిన టికెట్ ఇచ్చారు. నేను కూడా భారతీయుడినని చెప్పలేదు. ఆ ప్రాంగణం లోపల మాత్రం సల్వార్, కమీజ్ ధరించిన ఒక వ్యక్తి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించాడు. మేం చాలా నిజాయితీగా చెప్పాం, ‘లాహోర్ నుంచి’ అని. అతడు వెళ్లిపోయాడు. అప్పుడు, ఈ ప్రాంతంలో తిరిగే విదేశీయులకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ భద్రపరుస్తుందని మా గైడ్ చెప్పాడు. ఆ సంగతి అతడికి తెలుసు. ఇది విని మేం విస్మయానికి గురయ్యాం. మళ్లీ ఆ వ్యక్తే మమ్మల్ని ఆపి, జాతీయతను తెలియచేసే గుర్తింపు కార్డులు చూపించమని అడిగాడు. వాస్తవానికి అలాంటి కార్డులను పాకిస్తాన్ జాతీయులంతా దగ్గర ఉంచుకుంటారు. మేం దొరికిపోయాం. మమ్మల్ని ఐఎస్ఐ కార్యాలయంలోకి తీసుకు వెళ్లారు. ఆ కార్యాలయం కూడా ఆ ప్రాంగణం లోపలే ఉంది. అక్కడ మా పాస్‌పోర్టుల వివరాలన్నీ నమోదు చేసుకుని అప్పుడు వదిలిపెట్టారు. ఇలా చేస్తే విదేశీయులకు ఎంత ప్రమాదమో తెలియదా? అని బాగా చీవాట్లు పెట్టి మరీ వదిలిపెట్టారు.
‘రా’ ఏజెంట్లు దౌత్య పాస్‌పార్టుల మీదే సాధారణంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారని ఇంతకు ముందే చెప్పాను. ‘రా’తో నా అనుభవం, అఫ్ఘానిస్తాన్ యుద్ధ వార్తలు రాయడానికి వెళ్లినప్పటి నుంచి, అంటే 2001, అక్టోబర్ నుంచి ఉంది. అక్కడికి వెళ్లాలంటే మనం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ ద్వారా వెళ్లి, తరువాతి ప్రయాణం కోసం దుషాంబి దగ్గర వేచి ఉండాలి. అక్కడ హోటల్లో నేను మధ్య వయస్కులైన ఇద్దరు భారతీయులను కలుసుకున్నాను. వాళ్లు సూటు, టై ధరించి ఉన్నారు. వాళ్లిద్దరూ ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ దగ్గర, సాయంత్రం బార్ దగ్గర కనిపించేవారు. ఈ ఇద్దరూ చాలా భిన్నమైనవాళ్లు. మా వాహనం తజకిస్తాన్-అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలోకి వచ్చిన తరువాత మా పాస్‌పోర్టులను రష్యా సైనికులు తనిఖీ చేశారు. మిగిలిన అందరు విలేకరులను రష్యా వారు అనుమతించారు. ఇద్దరు భారతీయులను మాత్రం వెనక్కి, అంటే దుషాంబి పంపేశారు. నా కార్యక్రమం పూర్తయిన తరువాత రెండువారాలకి నేను హోటల్‌కు తిరిగి చేరుకున్నాను. నేను గుర్రం మీద నుంచి ఒక నదిలో పడిపోవడంతో నా పాస్‌పోర్టు మీద ముద్ర అలుక్కుపోయింది.
ఇది నన్ను చాలా ఆందోళనకి గురి చేసింది. ఇక హోటల్ దగ్గర నన్ను ఉజ్బెకిస్తాన్‌కు వరకు తీసుకువెళ్లిన ట్యాక్సీ చెడిపోయింది. నా బ్యాగ్ పెట్టుకుని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను చూసిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు అక్కడే ఉన్నాడు. అతడే అడిగాడు ఎక్కడి వెళుతున్నారు అని.
తన కారు ఎక్కమని (వాళ్లది తెల్ల మెర్సిడెజ్ బెంజ్) ఆహ్వానించాడు. నా పాస్‌పోర్టు మీద ముద్ర వేయించుకోవడానికి సరిహద్దు దగ్గర ఆగాం. ఆ ఇద్దరు కారులోనే ఉండిపోయారు. అక్కడ ఉన్న అధికారికి నా కథంతా చెప్పడం మొదలుపెట్టాను. అతడు కారులో ఉన్న ఆ ఇద్దరి కేసి ఒకసారి చూసి, ఇకచాలు అన్నట్టు నాకు చేత్తో సైగ చేశాడు. అప్పుడే ఆ ఇద్దరు ఎవరో నాకు అర్థమైంది. నేను అమాయకుడినే. కానీ రష్యా సైనికులు, ఉజ్బెకిస్తాన్ అధికారులు ‘రా’కు చెందిన వాళ్లని ఒక్క చూపుతో పట్టేశారు.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్