ఆరేళ్ల తర్వాత అర్హత
వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు భారత్
కొరియాపై 3-1తో గెలుపు
బుసాన్ (కొరియా): భారత డేవిస్‌కప్ జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్ పోటీల్లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన పోటీలో భారత్ 3-1తో గెలిచింది. ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-4, 5-7, 6-3, 6-1తో యాంగ్ క్యు లిమ్‌ను ఓడించాడు. దాంతో భారత్ విజయం ఖాయమైంది.
ఫలితం తేలిపోవడంతో సనమ్ సింగ్, హ్యున్ చుంగ్ మధ్య జరగాల్సిన రెండో రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. 2008 తర్వాత భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత పొందింది. చివరిసారి భారత్ 2008 వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 1-4తో రుమేనియా చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలు సెప్టెంబరు 12 నుంచి 14 వరకు జరుగుతాయి. నెదర్లాండ్స్, కెనడా, స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికా, అర్జెంటీనా, బెల్జియం, సెర్బియా జట్ల నుంచి ఒక జట్టు భారత ప్రత్యర్థిగా ఉంటుంది.