తొలి రోజు ముగిసిన ఆట..ఇంగ్లండ్ 53/3
తొలి రోజు ముగిసిన ఆట..ఇంగ్లండ్ 53/3
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 191 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లదాటికి తక్కువ పరుగులకే భారత్ కుప్పకూలిపోయింది. చివర్లో శార్ధూల్ ఠాకూర్ మెరుపులతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 57 పరుగులను శార్థూల్ ఠాకూర్ నమోదు చేశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్, శార్థూల్ మినహా ఇతర ప్లేయర్లు రాణించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 పరుగులను నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్, ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. తరువాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ జట్టు కు ఆదిలోనే భారత్ పేసర్ బుమ్రా భారీ దెబ్బ కొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్లను బుమ్రా డకౌట్ చేశాడు.
తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, డేవిడ్ మలన్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నిలకడగా రాణిస్తున్న సమయంలో జో రూట్ భారత బౌలర్ ఉమేష్ యాదవ్ చేతికి చిక్కాడు. ఉమేష్ బౌలింగ్‌లో రూట్ 21 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మలన్ 26, ఓవర్టన్ 1 ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది.
బుమ్రా విజృంభణ..6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఇంగ్లండ్ ఓపెనర్లు బర్న్స్(0), హమీద్(0)లను డకౌట్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 191 ఆలౌట్
రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బెయిర్‌స్టో క్యాచ్ పట్టడంతో ఉమేశ్ యాదవ్(10) పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు 191 పరుగుల వద్ద తెరపడింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్, ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో అలరించిన టీమిండియా పేసు గుర్రం బుమ్రా.. ఈ మ్యాచ్‌లో కనీసం ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే సున్నా పరుగులకే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 190 పరుగల వద్దనే తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. క్రీజ్‌లోకి సిరాజ్ వచ్చాడు
శార్దూల్(57) సుడిగాలి ఇన్నింగ్స్ సమాప్తం.. టీమిండియా స్కోర్ 190/8
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు క్రిస్ వోక్స్ తెరదించాడు. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శార్దూల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శార్దూల్.. 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో సుడిగాలి ఇన్నింగ్స్‌ను ఆడాడు. 61 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 190/8. క్రీజ్‌లో ఉమేశ్(10), బుమ్రా ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన శార్దూల్.. 31 బంతుల్లోనే అర్ధ శతకం
మహ్మద షమీ స్థానంలో జట్లులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్.. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టపార్డర్ బ్యాట్స్మెన్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ చోట బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనికి మరో ఎండ్‌లో ఉమేశ్ యాదవ్(9) స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. ఫలితంగా టీమిండియా 60 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఏడో వికెట్ డౌన్.. పంత్(9) ఔట్
క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రిషబ్ పంత్(9).. మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 127 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్(4)కు తోడుగా క్రీజ్‌లోకి ఉమేశ్ యాదవ్ వచ్చాడు.
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రహానే(14) ఔట్
ఇంగ్లీష్ గడ్డపై టీమిండియా బ్యాట్స్మెన్ల వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా మూడంకెల స్కోర్ సాధంచింది లేదు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ రహానే విషయానికొస్తే.. వరుస వైఫల్యాలతో జట్టులో చోటునే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఇవాల్టి ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే ఔటై మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఓవర్టన్ బౌలింగ్‌లో థర్డ్ స్లిప్‌లో మొయిన్ అలీ క్యాచ్ అందుకోవడంతో రహానే(14) పెవిలియన్ బాటపట్టాడు. 50 ఓవర్ల తర్వాత టీమిండియా 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్(3), శార్దూల్ ఠాకూర్(2) ఉన్నారు.
టీమిండియాకు బిగ్ షాక్.. కోహ్లి(50) ఔట్
ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్ టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. హాఫ్ సెంచరీ చేసి సూపర్ టచ్‌లో ఉన్నట్లు కనిపించిన విరాట్ కోహ్లి(50)ని అద్బుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 105 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. రహానే(5)కి జతగా క్రీజ్‌లోకి రిషబ్ పంత్ వచ్చాడు.
కోహ్లి మళ్లీ ఫిఫ్టి కొట్టాడు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చాలాకాలం తర్వాత వరుస ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాలు సాధించాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లి.. ఈ ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకంతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న కోహ్లి 84 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో ఫిఫ్టి కొట్టాడు. 40 ఓవర్ల తర్వాత టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. కోహ్లి, రహానే(5) క్రీజ్‌లో ఉన్నారు.
ఆచితూచి ఆడుతున్న కోహ్లి(45), రహానే(5).. టీమిండియా స్కోర్ 100/4
69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో తొలిసారి 30 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. కెప్టెన్ కోహ్లి(45; 7 ఫోర్లు) ఫామ్‌ను దొరకబుచ్చుకున్నట్లు కనిపించగా.. రహానే(5) ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో టీమిండియా 39 ఓవర్లో 100 పరుగుల మార్కును చేరుకుంది.
69 పరుగుల వద్ద నాలుగో వికెట్ డౌన్.. జడేజా(10) ఔట్
నాలుగో టెస్ట్‌లోనూ లీడ్స్ టెస్ట్ ఫలితమే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. భారత బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఏదో ఉద్దరిస్తాడని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి పంపిన జడేజా 10 పరుగులకే చేతులెత్తేశాడు. వోక్స్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో రూట్ క్యాచ్ అందుకోవడంతో జడేజా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో టీమిండియా 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజ్‌లో కోహ్లి(23; 4 ఫోర్లు), రహానే ఉన్నారు.
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. పుజారా(4) ఔట్
లీడ్స్ టెస్ట్‌లో సీన్ మరోసారి పునరావృతం అవుతోందా అంటే అవుననే చెప్పాలి. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిందో అలానే ఈ టెస్ట్‌లోనూ తొలి సెషన్లోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి టీమిండియా మ్యాచ్‌పై పట్టు చేజార్చుకుంటుంది. 28 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్.. మరో 11 పరుగులు మాత్రమే జోడించి మూడో వికెట్‌ను కోల్పోయింది. 4 పరుగుల స్కోర్ వద్ద పుజారా ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి మరోసారి నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో కెప్టెన్ కోహ్లి(5), జడేజా ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(17) ఔట్
ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా తొలి సెషన్లోనే రెండో వికెట్ కోల్పోయింది. 3 బౌండరీలు బాది జోరు మీదున్నట్లు కనిపించిన కేఎల్ రాహుల్(17; 3 ఫోర్లు)ను రాబిన్సన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి వికెట్ కోల్పోయాక ఐదు ఓవర్లు ఆడి ఒక్క పరుగు కూడా చేయని భారత్.. అదే స్కోర్ వద్ద(28) రెండో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో పుజారా, కోహ్లి ఉన్నారు.
టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. రోహిత్(11) ఔట్
సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్.. తాను వేసిన తొలి ఓవర్లోనే టీమిండియాకు భారీ షాకిచ్చాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతిని సంధించి రోహిత్ శర్మ(11; ఫోర్)ను బోల్తా కొట్టించాడు. వికెట్‌కీపర్ బెయిర్‌స్టో అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. 9 ఓవర్ల అనంతరం టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్‌లో కేఎల్ రాహుల్(17), పుజారా(0) ఉన్నారు.
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగాయి. టీమిండియాలో ఇషాంత్, మహ్మద్ షమీల స్థానంలో శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగగా, ఇంగ్లండ్ జట్టులో జోస్ బట్లర్, సామ్ కర్రన్ల స్థానాలను ఓలీ పోప్, క్రిస్ వోక్స్ భర్తీ చేయనున్నారు.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.