రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో పర్యాటక ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్‌ను చేయగలిగింది. జో రూట్ కెరీర్‌లో 31వ టెస్ట్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3), బెన్ ఫోక్స్(47), టామ్ హార్ట్లీ (13) ఔట్ కాగా.. రూట్ (106), రాబిన్సన్ (31) క్రీజ్‌లో ఉన్నారు.
భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్ 2, రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.
తొలి రోజు హైలైట్స్..
- టీమిండియా అరంగేట్రం పేసర్ ఆకాశ్‌దీప్ అద్బుతమైన ఇన్ స్వింగర్‌తో జాక్ క్రాలేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఆ బంతిని ఆకాశ్ క్రీజ్ దాటి సంధించడంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఆకాశ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.
- టెస్ట్ క్రికెట్‌లో ఓ ప్రత్యర్థిపై 1000 పరుగులు మరియు 100 వికెట్లు తీసిన తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఇంగ్లండ్‌పై 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కాడు.
- ఈ మ్యాచ్‌లో రూట్ చేసిన సెంచరీ టెస్ట్‌ల్లో అతనికి 31వది. అన్ని ఫార్మాట్లలో కలిపితే 47వది. ఈ సెంచరీతో రూట్ ప్రస్తుత క్రికెటర్లలో (అన్ని ఫార్మాట్లలో) అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు.
- ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో (47) కలిసి రూట్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (45) ఉన్నాడు.
- తాజా సెంచరీతో రూట్ ఫాబ్ ఫోర్‌లో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో విలియమ్సన్ (32), స్టీవ్ స్మిత్ (32) టాప్‌లో ఉండగా.. రూట్ (31), కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
- ఈ సెంచరీతో రూట్ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్.. స్టీవ్ స్మిత్‌ను (9) అధిగమించాడు.
Comments
Please login to add a commentAdd a comment