ఆదిలోనే అవాంతరం!
రెండుసార్లు ఆగిన ఫ్లడ్‌లైట్లు
* దులీప్ ట్రోఫీ ‘పింక్‌బాల్’ మ్యాచ్
* తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం
గ్రేటర్ నోయిడా: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా పింక్ బంతితో తొలిసారి నిర్వహించిన డే అండ్ నైట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు మొదటి రోజే అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇండియా రెడ్, ఇండియా గ్రీన్ జట్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో మంగళవారం రెండు సార్లు ఫ్లడ్ లైట్లు ఆరిపోయాయి. దాంతో గంటకు పైగా ఆటకు అంతరాయం కలిగింది. ఇండియా గ్రీన్ ఇన్నింగ్స్ సందర్భంగా మూడు ఓవర్ల తర్వాత డిన్నర్బ్రేక్ సమయంలో లైట్లు ఆగడంతో 17 నిమిషాలు ఆట ఆలస్యమైంది. ఆ తర్వాత 9.3 ఓవర్ల తర్వాత మళ్లీ చీకటి కమ్మేసింది. దాంతో లైట్లను పునరుద్ధరించేందుకు దాదాపు గంట సమయం పట్టింది.
పింక్‌బాల్‌తో తొలి మ్యాచ్‌ను పేరున్న స్టేడియంలో కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించడంతో బోర్డుకు భంగపాటు ఎదురైంది. ఈ గ్రౌండ్లో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో పింక్ బంతి పేస్ బౌలర్లకు బాగా సహకరించింది. ఒక్క రోజులోనే మొత్తం 17 వికెట్లు పడ్డాయి. గ్రీన్ ఆటగాడు సందీప్ శర్మ (4/62) చెలరేగడంతో ఇండియా రెడ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.
ముకుంద్ (77) రాణించగా, యువరాజ్ (4) సహా అంతా విఫలమయ్యారు. అనంతరం గ్రీన్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేయగలిగింది. రైనా (35)దే అత్యధిక స్కోరు. ప్రస్తుతం గ్రీన్ మరో 45 పరుగులు వెనుకబడి ఉంది. నాథూ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.