మిన్నంటిన సంబరాలు
ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ పతాకాల ఆవిష్కరణ, వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు
పేదలకు అన్నదానం రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగింది. పార్టీ శ్రేణులు వాడవాడలా వైఎస్సార్ సీపీ పతాకాన్ని ఎగుర వేసి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాలుగేళ్ల ప్రస్థానాన్ని నేతలు మననం చేసుకున్నారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన పోరుబాట సాగిస్తూ ఆదర్శ నేత అని నిరూపించుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తరువాత ఒక్క హామీ కూడా నెరవేర్చక ప్రజలను మోసగించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, బాబు మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరుబాట సాగిస్తున్న విషయం ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నారని, వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోయి వారికి అండగా నిలవాల్సిన అవసరముందని వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విప్లవాత్మక రీతిలో అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు మరింతగా కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఘనంగా జరిగాయి.
చిత్తూరులో పలుచోట్ల జరిగిన వేడుకల్లో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవితోపాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తిరుపతి నియోజకవర్గంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది పేదలకు అన్నదానం చేశారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. పూతలపట్టులో రాజారత్నంరెడ్డి ఆధ్వర్యంలో, ఐరాలలో మహిళా నాయకురాలు శైలజాచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కుప్పం నియోజకవర్గంలో మండల కన్వీనర్ వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.మదనపల్లె నియోజకవర్గపరిధిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబ్జాన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్వీట్లు పంచారు. సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పీలేరు నియోజకవర్గంలో జిల్లా అధికార ప్రతినిధి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని మండలాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.
పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎంపీ కోటాలో మంజూరైన గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు పంపిణీ చేశారు.
పుత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ చైర్మన్‌తోపాటు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రముఖుల పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యక్రమాలను నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోనూ వేడుకలను నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. జీడీనెల్లూరు నియోజకవర్గంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.