అనంతలో హై అలర్ట్
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ‘అనంత’లో హై అలర్ట్ ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి టీనోట్‌పై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీజీపీ ఆదేశాలతో ఉన్నతాధికారులు అన్ని స్టేషన్లను అలర్ట్ చేశారు.
అవాంఛనీయ, హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సెట్లో ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ప్రధాన పట్టణాలకు తరలించారు. ఆది నుంచి ఉద్యమానికి చుక్కానిలా నిలుస్తున్న ‘అనంత’లో సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారని భావించిన పోలీసులు అన్ని చోట్లా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎస్కేయూ పరిసర ప్రాంతాల్లోంచి విద్యార్థులు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను ఆదేశించారు.
టీ నోట్ విషయం తెలియగానే విద్యార్థులు నగరానికి ర్యాలీగా బయలుదేరడంతో వారిని పోలీసులు అటకాయించారు. దీన్ని గ్రహించిన విద్యార్థులు ఆకుతోటపల్లి పొలాల మీదుగా రావాలని ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ సమయంలో ఒక్క మహిళా పోలీసు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. ఉద్యమం తీవ్ర స్థాయికి చేరకుండా ఉండేందుకు ఎస్పీ శ్యాంసుందర్ నేరుగా రంగంలోకి దిగారు. ఆందోళనలు ఉధృతం కాకముందే సిబ్బందితో నగరంలో పరిస్థితులను పర్యవేక్షించారు.
మధ్యాహ్నం డీఎస్పీలు దయానందరెడ్డి, వెంకటయ్య, సీఐలతో కలిపి అనంతపురం టవర్‌క్లాక్ చేరుకుని మీడియాతో మాట్లాడారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యమం తీవ్రతరం కాకుండా రాత్రి కొందరు సమైక్యవాదులను నిర్బంధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
డీజీపీ వీడియో కాన్ఫరెన్స్..
తెలంగాణ నోట్ సిద్ధమైందని, గురువారం సాయంత్రం కేబినెట్ ఆమోదం తెలుపుతుందన్న ముందస్తు సమాచారం అందడంతో డీజీపీ ప్రసాద్‌రావు ఉదయమే జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ శ్యాంసుందర్ పాల్గొన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక బలగాలను మోహరింపజేయాలని ఆదేశించారు.