తల్లి పనిచేసే ఇంట్లో చోరీ..
తల్లి పని చేసే ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ మైనర్ బాలికను కంచన్‌బాగ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 26 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎన్.శంకర్ కేసు వివరాలను వెల్లడించారు. సంతోష్‌నగర్ యాదగిరినగర్ రోడ్డు నంబర్ 12 ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగులు రాజు, దయావతిలు దంపతులు. రాజు ఇంట్లో చంపాపేట్ చిలకల బస్తీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పని చేస్తోంది.
దయావతి మూడు రోజుల క్రితం బీహెచ్ఈఎల్లోని బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం వచ్చి చూడగా అల్మారాలో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పని మనిషితో పాటు ఆమె కూతురు(15)ని అదుపులోకి విచారించగా దొంగతనం విషయం బయట పడింది. దయావతి భర్త పని మనిషిని నమ్మి బయటికి వెళ్లడం....తల్లి ఇంటి పనిలో నిమగ్నమై ఉండడాన్ని గమనించిన సదరు బాలిక అల్మారాలో ఉన్న బంగారు నగలను తస్కరించింది. దర్యాప్తులో బాలికే దొంగతనానికి పాల్పడిందని తేలడంతో బాలికను జూవైనల్లో హోమ్‌కు తరలించారు.