రుణాలు మాఫీ చేయకనే విజయోత్సవాలా?
సంబేపల్లె : రుణాలు పూర్తిగా మాఫీ చేయకుండానే విజయోత్సవాలు నిర్వహించాలను కోవడం తెలుగుదేశం ప్రభుత్వ తీరు విడ్డూరంగా ఉందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని ప్రకాశనగర్ కాలనీ లోని మినిమరెడ్డిగారిపల్లెలో మునీంద్రారెడ్డి ఇచ్చిన విందు, గుట్టపల్లెలోని గుదియవాండ్లపల్లెకు చెందిన కేతంరెడ్డి ఆదిరెడ్డి కుమారుల కేశఖండన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రుణాలు ఇంకా మాఫీ కాలేదని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి వివరించారు.
రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకులోను ఖాతా నంబర్, భూమి వివరాలను రెవెన్యూ, బ్యాంకు అధికారులు సక్రమంగా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ ఫిర్యాదుల కేంద్రాల్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్హుడైన ప్రతిరైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుని, విజయోత్సవాలు జరుపుకోవాలని ఆయన ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో చిదంబరరెడ్డి, డాక్టర్ కిషోర్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి,ప్రతాపరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీసభ్యుడు రామమోహన్, మాజీ సర్పంచ్ పాల వెంకట్రమణ, పూల వెంకట్రమణ పాల్గొన్నారు.