dccb office
-
రైతులకే తొలి ప్రాధాన్యత
– మహాజన సభలో డీసీసీబీ చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : సహకార బ్యాంకుల ద్వారా రుణ వితరణలో రైతులకే తొలిప్రాధాన్యత ఇస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సీఈవో కాపు విజయచంద్రారెడ్డి అధ్యక్షతన మొదట పాలకవర్గ సమావేశం, తర్వాత 113వ మహాజన సభ నిర్వహించారు. చైర్మన్ శివశంకరరెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా రైతులు, చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే మహిళలు, పేద వర్గాలు, ఇతర ఖాతాదారులందరికీ అన్ని రకాల ఆధునిక సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల వరకు పంట రుణాలు, రూ.35 కోట్లు వాణిజ్య పంటలకు రుణాలు, మరో రూ.7 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశామన్నారు. జనతా ప్రమాదబీమా పథకం ద్వారా రూ.లక్ష చొప్పున పరిహారం అందించామన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న ‘అనంత’ను ప్రత్యేకంగా చూడాలని నాబార్డు, ఆప్కాబ్‌కు విన్నవించిన నేపథ్యంలో మొండిబకాయిల వసూళ్లకు వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) చాలాకాలం పాటు అమలు చేశామన్నారు. అసలు, వడ్డీలో కేవలం 35 శాతం చెల్లిస్తే మిగతా 65 శాతం మాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేసిన ఘనత డీసీసీబీదేనన్నారు. 1997కు ముందు తీసుకున్న మొండిబకాయిల వసూళ్ల కోసం మరోసారి ఓటీఎస్ పథకం అమలుకు అనుమతులు ఇవ్వాలని కోరగా అనుమతులు జారీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెలాఖరులోపు 1.21 లక్షల మంది రైతులకు రూపేకార్డులు అందజేస్తామన్నారు. రానున్న 2017–18 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆధునిక సేవలు, విరివిగా రుణాలు అందజేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి (డీసీవో) సూర్యనారాయణ, పాలక వర్గం సభ్యులు, పీఏసీఎస్, చేనేత సొసైటీ అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
► ఫోర్జరీ పట్టాలు పుట్టించి భారీ కట్టడం ► డీసీసీబీ బ్రాంచికి అద్దెకిచ్చిన వైనం l ► ఎమ్మెల్యే అనుచరుడి దురాగతం ఆకివీడు : ఆయనో అధికార పార్టీ నేత, ఆపై స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరుడు. ఇంకేం తనకు తిరుగు లేదనుకున్నాడు. ఏకంగా రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై కన్నేశాడు. అంతే.. ఆ భూమికి పట్టా పుట్టించి పలుకుబడితో పంచాయతీలో ప్లాన్ అప్రూల్ చేయించుకున్నాడు. ఆ భూమిపై హైకోర్టులో పిల్ నడుస్తుండటంతో భవన నిర్మాణం చకచకా పూర్తిచేసేశాడు. ఆ భవనాన్ని ప్రభుత్వ రంగ సంస్థ డీసీసీబీ బ్రాంచికే అద్దెకు ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని గుమ్ములూరు గ్రామ సర్పంచ్ కోపల్లె రత్నమాణిక్యం, ఉపసర్పంచ్ కోపల్లె సాయిబాబు ఆకివీడులోని గుమ్ములూరు వెళ్లే రోడ్డులో 2014లో 30 సెంట్ల భూమిని కొన్నారు. అదే ప్రాంతంలో పడమరవైపున రోడ్డు మార్జిన్లో తొమ్మిది సెంట్ల పోరంబోకు స్థలం ఉంది. ఈ స్థలానికి 2008లో పట్టా పుట్టించారు. రూ.మూడుకోట్ల విలువ చేసే ఆ స్థలంలో రెండంతస్తుల భవనం నిర్మించారు. భవనంలో కింది భాగాన్ని డీసీసీబీ బ్రాంచి కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు ప్రారంభించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి డీసీసీబీ చైర్మన్‌కూడా సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతోనే ఈ వ్యవహారం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను పలువురు కోరుతున్నారు. దర్యాప్తునకు వైఎస్సార్ సీపీ డిమాండ్ కబ్జాపై కలెక్టర్ స్పందించి తక్షణం విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు కేశిరెడ్డి మురళీ, మండల కన్వీనర్ గుండా సుందరరామనాయుడు, రూరల్ బ్యాంక్ డైరెక్డర్ నంద్యాల సీతారామయ్య, ఆకివీడు ఉపసర్పంచ్ షేక్ హుస్సేన్ తదితరులు డిమాండ్ చేశారు. 2014లో కొన్న స్థలం ముందు ఉన్న ప్రభుత్వ భూమికి 2008లో ఎలా పట్టా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అండదండలతోనే నకిలీ పట్టాలు పుట్టించారని విమర్శించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే.. హైకోర్టు ఉత్తర్వులకు లోబడే భవన నిర్మాణంపై పంచాయతీ తీర్మానం చేసింది. ప్లాన్ అప్రూవల్‌కు వచ్చినప్పుడు ఆ స్థలం పోరంబోకు స్థలమని నేను నోట్ రాశా. దీనిపై సర్వే చేయించాలని తహశీల్దార్‌ను కోరగా.. సర్వే చేయించి నాలుగు సెంట్ల భూమి పోరంబోకులో ఉందని రాతపూర్వకంగా తెలిపారు. కోపల్లె సాయిబాబు, రత్నంమాణ్యింల పేరున ఒకొక్కరికి రెండున్నర సెంట్లకు 2008లో పట్టాలు ఇచ్చారు. భవన నిర్మాణం ఏ ప్రాంతంలో జరిగిందో నాకు తెలీదు. సైట్ మ్యాప్ ప్రకారం ప్లాన్ అప్రూవల్ చేశారు. - ఎన్.ఠాగూర్, కార్యదర్శి, ఆకివీడు. -
మిల్లర్లతో మిలాఖత్
శ్రీకాకుళం/టౌన్:రైతులు పండించిన పంట కొనుగోళ్లలో మిల్లర్లతో మిలాఖత్ అయి ప్రాథమిక సహకార పరపతి సంఘాలు వాటాలు పంచుకున్నాయని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం డీసీసీబీ పాలకవర్గాన్ని ఉద్దేశించి అన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల మిల్లర్లు శ్రీకాకుళం జిల్లా రైతుల వద్ద ధాన్యం విడిచిపెట్టి ఒడిశా నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడ్డారని ప్రస్తావించా రు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన డీసీసీబీ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. అందుకు ప్రతిగా పాలకవర్గ సభ్యులు గట్టిగానే స్పందించారు. చైర్మన్ డోల జగన్ కల్పించుకొని పౌరసరఫరాలశాఖ, రెవెన్యూశాఖలను ప్రశ్నించాల్సిన అంశాలను ప్రాథమిక పరపతిసంఘాలపై రుద్దడం సమంజసం కాద ని, మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆ సమయంలో కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ మధ్య వాదనలు పెరగడంతో జగన్ తన కుర్చీలోనుంచి లేచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మిగిలిన పాలకవర్గ సభ్యులు దువ్వాడ శ్రీధర్, నర్తు నరేంద్రయాదవ్ కల్పించుకొని కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న సభ్యులు జగన్‌ను వారించడంతో వెనుదిరిగారు. జిల్లా వ్యాప్తంగా 49 పీఏసీఎస్‌లు ఉన్నాయని, ఆరు సంఘాలకు కొత్తగా గోదాంలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జగన్ వివరించారు. ఈ గోదాంల నిర్మాణానికి అవసరమైన నిధులు సమీకరణకు వీలుగా ధాన్యం కొనుగోలు కమీషన్ విడుదల చేయాలని అభ్యర్థించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ధాన్యం ఎక్కడ కొన్నారని, మిల్లర్లతో పీఏసీఎస్ ప్రతినిధులు(మీరు) కుమ్మక్కై ఒడిశాలో ధాన్యం కొనుగోలును ప్రోత్సహించారని ప్రస్తావించారు. మిల్లర్లు కొన్న ధాన్యానికి కమీషన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. కో-ఆపరేటివ్ అదనపు రిజిస్ట్రార్ ఏవీవీ ప్రసాద్ మాట్లాడుతూ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి సాంకేతిక పద్ధతులను అలవర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, సీఈవో సత్యనారాయణ, డీ జీఎం జ్యోతిర్మయి, డి.వరప్రసాద్, బోర్డు డెరైక్టర్లు పాల్గొన్నారు. -
షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలి
శ్రీకాకుళం అర్బన్:ఎటువంటి షరతులూ లేకుండా వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత రుణాలు మాఫీ చేయాలని ఏపీ స్టేట్ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళంలోని డీసీసీబీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు అంపలాం మాధవరావు మాట్లాడుతూ కుటుంబ యజమానితో నిమిత్తం లేకుండా అందరి రుణాలను మాఫీ చేయాలన్నారు. జీవో నంబరు 174లో తెలిపిన ప్రకారం సహకార సంఘాల్లో రుణం చెల్లించి తిరిగి వాడకుండా ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర సహకార బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించాలన్నారు. జీవో నంబరు 174లో లేని విధంగా ప్రతి అప్పుదారునికి సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించమనడం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకు అగౌరవపరచి రైతుల ద్వారా సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించమని పీఏసీఎస్ ఉద్యోగులకు, సిబ్బందికి ఒత్తిడి తేవడం సరైన విధానం కాదన్నారు. పంటల బీమా పథకం ద్వారా వచ్చిన సొమ్ముకు ఎటువంటి షరతులు లేకుండా రైతుల రుణ ఖాతాలకు నేరుగా చెల్లించాలన్నారు. ధర్నా కార్యక్రమంలో ఇచ్ఛాపురం పీఏసీఎస్ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, జిల్లా రైతాంగ ప్రధాన కార్యదర్శి కోనారి మోహనరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు, జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి వెలమల రమణారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు పోలాకి ప్రసాదరావు, పీఏసీఎస్ యూనియన్ జిల్లా కార్యదర్శి లోలుగు మోహనరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బమ్మిడి శ్రీరాములు పాల్గొన్నారు.