రైతులు పండించిన పంట కొనుగోళ్లలో మిల్లర్లతో మిలాఖత్ అయి ప్రాథమిక సహకార పరపతి సంఘాలు వాటాలు పంచుకున్నాయని
శ్రీకాకుళం/టౌన్:రైతులు పండించిన పంట కొనుగోళ్లలో మిల్లర్లతో మిలాఖత్ అయి ప్రాథమిక సహకార పరపతి సంఘాలు వాటాలు పంచుకున్నాయని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం డీసీసీబీ పాలకవర్గాన్ని ఉద్దేశించి అన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల మిల్లర్లు శ్రీకాకుళం జిల్లా రైతుల వద్ద ధాన్యం విడిచిపెట్టి ఒడిశా నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడ్డారని ప్రస్తావించా రు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన డీసీసీబీ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. అందుకు ప్రతిగా పాలకవర్గ సభ్యులు గట్టిగానే స్పందించారు.
చైర్మన్ డోల జగన్ కల్పించుకొని పౌరసరఫరాలశాఖ, రెవెన్యూశాఖలను ప్రశ్నించాల్సిన అంశాలను ప్రాథమిక పరపతిసంఘాలపై రుద్దడం సమంజసం కాద ని, మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆ సమయంలో కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ మధ్య వాదనలు పెరగడంతో జగన్ తన కుర్చీలోనుంచి లేచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మిగిలిన పాలకవర్గ సభ్యులు దువ్వాడ శ్రీధర్, నర్తు నరేంద్రయాదవ్ కల్పించుకొని కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.
అక్కడున్న సభ్యులు జగన్‌ను వారించడంతో వెనుదిరిగారు. జిల్లా వ్యాప్తంగా 49 పీఏసీఎస్‌లు ఉన్నాయని, ఆరు సంఘాలకు కొత్తగా గోదాంలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జగన్ వివరించారు. ఈ గోదాంల నిర్మాణానికి అవసరమైన నిధులు సమీకరణకు వీలుగా ధాన్యం కొనుగోలు కమీషన్ విడుదల చేయాలని అభ్యర్థించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ధాన్యం ఎక్కడ కొన్నారని, మిల్లర్లతో పీఏసీఎస్ ప్రతినిధులు(మీరు) కుమ్మక్కై ఒడిశాలో ధాన్యం కొనుగోలును ప్రోత్సహించారని ప్రస్తావించారు. మిల్లర్లు కొన్న ధాన్యానికి కమీషన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. కో-ఆపరేటివ్ అదనపు రిజిస్ట్రార్ ఏవీవీ ప్రసాద్ మాట్లాడుతూ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి సాంకేతిక పద్ధతులను అలవర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, సీఈవో సత్యనారాయణ, డీ జీఎం జ్యోతిర్మయి, డి.వరప్రసాద్, బోర్డు డెరైక్టర్‌లు పాల్గొన్నారు.