కలెక్టరేట్ నుంచి దూకిన ఉద్యోగ సంఘాల నేత
కాకినాడ: పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కాకినాడ కలెక్టరేట్ భవనం వద్ద చోటు చేసుకుంది. గత 10 నెలలుగా పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంపై చటర్జీ గత కొద్దికాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటూ కాకినాడ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కలెక్టరేట్ భవనంపై నుంచి దూకినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన చటర్జీని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు(ఎంపీహెచ్ఏ) ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద బైఠాయించిన వీరు రాత్రి డీఎంహెచ్ఓ కార్యాలయ భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన తెలిపారు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.చటర్జీ మాట్లాడుతూ మే 15 నాటికి జీతాలు చెల్లిస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ గత నెల 17న తమకు హామీ ఇచ్చారని.. అయితే జీతాల కు సంబంధించిన బడ్జెట్ ఇంకా విడుదల కాలేదన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నారని...సక్రమంగా జీతాలు రాకపోవడంతో గండేపల్లి పీహెచ్సీలో ఎంపీహెచ్ఏగా విధులు నిర్వహిస్తున్న జగన్ మురళి సుమారు 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులకు వెల్లడించారు. తమకు జీతాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన చటర్జీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉద్యోగులను విషాదంలోకి నెట్టింది.