ప్రతి పనికి ఒక రేటు
సాక్షి, గుంటూరు : ఫైలుపై ఆయన సంతకం చేయాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే... లేదంటే ఎప్పటికి క్లియర్ అవుతుందో ఎవరూ చెప్పలేరు.. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి తాను అనుకున్నంత మామూలు ఇస్తేనే పని చేస్తారు... ఆయన రూటే సెపరేటు .. ఆయన ఎవరోకాదు.. ఆంధప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ అధికారి (డీసీహెచ్)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చుండూరు ప్రసన్నకుమార్. తన పరిధిలోని ఆస్పత్రుల డైట్ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మంజూరు చేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. తన కింద పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశగా మారింది. దీంతో ఆయన మామూళ్ల గురించి పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
బిల్లుకు ముడుపులు ఇవ్వాల్సిందే !
వైద్య ఉద్యోగులు తమకు రావాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లు, పీఆర్సీ బిల్లు, ఎర్న్‌లీవ్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా.. ఏ బిల్లుపైనా అయినా సంతకం చేయకుండా ఉద్యోగుల అకౌంట్స్‌లో డబ్బులు జమవ్వవు. పలుమార్లు ఉద్యోగులకు సంతకాలు పెట్టకుండా కుంటిసాకులతో ఫైల్స్‌ను వెనక్కి పంపిస్తారని, డబ్బులు ఇస్తే వెంటనే సంతకం పెడతారని వైద్య సిబ్బంది అంటున్నారు. సదరు బిల్లులపై సంతకం పెట్టేందుకు కార్యాలయ ఉద్యోగుల ద్వారా డాక్టర్ ప్రసన్నకుమార్ డబ్బులు భారీగా తీసుకుంటారని వైద్య ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల బిల్లులే కాకుండా మందుల కాంట్రాక్టర్, డైట్ కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు కూడా ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏడాదికి కావాల్సిన బడ్జెట్‌ను ఎక్కువ మొత్తంలో తెప్పించి వాటిని అడ్డదారిలో తానే దిగమింగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రాచేశారనే ఆరోపణలు ఆడిట్ జరిగిన సమయంలో వచ్చాయి.
బినామీ పేరుతో మందుల వ్యాపారం
జిల్లాలోని పలు ఆస్పత్రులకు మందులు, సర్జికల్ వస్తువులు తన మందుల షాపు నుంచే కొనుగోలు చేయిస్తున్నారని డాక్టర్ ప్రసన్నకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. చీరాలలోని మందుల షాపును బినామీ పేర్లతో తానే నిర్వహిస్తున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దంత వైద్యానికి సంబంధించిన వైద్య పరికరాలు, చికిత్స మెటీరియల్ కొనుగోలుకు భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
కాంట్రాక్ట్ ఉద్యోగాలకు లక్షల్లో వసూలు
తన అధికార పరిధిలోని ఆస్పత్రుల్లో పలు కాంట్రాక్ట్ వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకాలకు లక్షల్లో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనతోపాటు పనిచేస్తున్న వైద్యుల పిల్లలకు సైతం డబ్బులు ఇస్తేనే ఉద్యోగం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ చీరాల ఆస్పత్రిని తనిఖీ చేసి డాక్టర్ ప్రసన్నకుమార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి బదిలీ చేశారు. అయితే, తనకున్న పలుకుబడితో గుంటూరు కోఆర్డినేటర్‌గా 12–8–2017న పోస్టింగ్ వేయించుకున్నారు. ఇక్కడ అందిన కాడికి దండుకుంటూ కూడబెట్టుకుంటూ వైద్యుల్ని, వైద్య సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్ అధికారికాక పోయినా ఫుల్ అడిషనల్ చార్జి( ఎఫ్ఏసీ) హోదాలో రెండేళ్లపాటు పలు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడినట్లు వైద్య సిబ్బంది చర్చించుకుంటున్నారు. సాక్షాత్తూ జిల్లాస్థాయి అధికారినే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే సరికి బుధవారం కార్యాలయ ఉద్యోగుల్లో అధికశాతం మంది తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని విధులకు డుమ్మా కొట్టడం చర్చాంశనీయంగా మారింది.
ఏసీబీ దాడులతో తెనాలిలో కలకలంతెనాలి
గుంటూరులో జరిగిన ఏసీబీ దాడులు తెనాలిలో కలకలం సృష్టించాయి. తెనాలికి సంబంధించిన జిల్లాస్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, అతన్ని పట్టించిందీ ఇక్కడకు చెందిన కాంట్రాక్టరు కావడంతో చర్చనీయాంశమైంది. ఒకే కాంట్రాక్టర్ ఇప్పటికి ముగ్గురు వైద్యుల్ని ఏసీబీకి పట్టించడం విశేషం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులో పని చేస్తున్న డాక్టర్ సీహెచ్. ప్రసన్నకుమార్ డెప్యుటేషన్‌పై వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయాధికారిగా వ్యవహరిస్తున్నారు. తెనాలి వైద్యశాల డైట్ కాంట్రాక్టరు తాడిబోయిన శ్రీనివాసరావుకు రావాల్సిన రూ. 20 లక్షల బిల్లులకు సంబంధించి రూ. లక్ష లంచం తీసుకోగా, ఏసీబీ అధికారులు గుంటూరులో రెడ్ హ్యాండెడ్‌గా బుధవారం పట్టుకున్నారన్న వార్త ఇక్కడి వైద్యశాలతో పాటు పట్టణంలో చర్చనీయాంశమైంది.
ముగ్గురు వైద్యాధికారులను
పట్టించిన కాంట్రాక్టర్
సుమారు దశాబ్దానికి పైగా శ్రీనివాసరావు తెనాలి జిల్లా వైద్యశాల డైట్ కాంట్రాక్టరుగా పని చేస్తున్నారు. రోగులకు అందించే ఆహారానికి సంబంధించి అధికారులు తయారు చేసే అంచనాల్లో అతి తక్కువ ధరలు ఉండడంతో, దీనిపై ఇతర కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో శ్రీనివాసరావు కాంట్రాక్టును రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నారు. రోగుల ఆహారానికి సంబంధించి బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు వేధిస్తే ఏసీబీని ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ముగ్గురు వైద్యాధికారులను ఏసీబీకి పట్టించారు. 2014లో అప్పటి తెనాలి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. రవీంద్రకుమార్ తన కాంట్రాక్టు రెన్యువల్ చేసే విషయంలో లంచం అడిగారంటూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించారు. అంతకు కొన్నేళ్ల క్రితం అప్పటి వైద్యశాల ఆర్ఎంవో డాక్టర్ గంగాధర్నూ ఏసీబీకి పట్టించారు. తాజాగా డాక్టర్ ప్రసన్నకుమార్ లంచం తీసుకుని దొరికారు.