వజ్రాల దొంగల గుట్టు రట్టు
వ్యాపారులమంటూ మోసం చేసి, భారీ మొత్తంలో వజ్రాలు దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. నిర్విరామంగా శ్రమించిన ప్రత్యేక బృందం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసిన దోపిడీకి గురైన రూ.38.6 లక్షల విలువైన సొత్తును యథాతథంగా రికవరీ చేసినట్లు ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ ముఠాకు ఇద్దరు వ్యాపారులే సూత్రధారులుగా ఉన్నట్లు ఆమె వివరించారు. అదనపు డీసీపీ నరోత్తమ్రెడ్డితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
తమిళనాడులోని తిరుచినాపల్లి డైమండ్ స్ట్రీట్‌కు చెందిన బాలకృష్ణ వృత్తిరీత్యా వజ్రాలు, ఖరీదైన రాళ్ల వ్యాపారి. వ్యాపారం నిమిత్తం పాతికేళ్లుగా నగరానికి వచ్చిపోతున్న ఇతను వచ్చిన ప్రతీసారి మార్కెట్ ఠాణా పరిధిలో ఉన్న తక్కువ ఖరీదు లాడ్జిల్లో బస చేసేవాడు. ఇతనితో లింగంపల్లిలో అశోక పెరల్స్ దుకాణం నిర్వహించే సి.మహేందర్, మెదక్ జిల్లా రామచంద్రాపురంలో ముత్యాలు, రంగురాళ్ల వ్యాపారం చేసే ఇతడి సమీప బంధువైన ఎం.బాబు పరిచయం పెంచుకున్నారు. తామూ వ్యాపారులమే అంటూ బుట్టలో వేసుకుని అతడి వద్ద ఉండే సొత్తు వివరాలు తెలుసుకొని దోపిడీకి పథకం వేశారు.
మరో ఐదుగురితో కలిసి ముఠా కట్టి...
తమ పథకాన్ని అమలు చేసేందుకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని వారిని ఎంచుకున్నారు. సమీప బంధువులు, ముత్యాల వ్యాపారులైన సి.శ్రీధర్, ఎం.శంకర్, సి.చిన శ్రీనివాస్‌లతో పాటు పి.రాజు, మహ్మద్ అన్వర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. బాలకృష్ణ ఫోన్ నెంబర్, వివరాలను చిన శ్రీనివాస్‌కు అందించి అతడి ద్వారా గతనెల 25న ఫోన్ చేయించారు. తాను భారీ మొత్తంలో ముత్యాలు, రంగురాళ్లు కొంటానని, మియాపూర్ రావాలని చినశ్రీనివాస్.. బాలకృష్ణకు ఫోన్ చేసి కోరాడు. ఒకే వ్యాపారికి తన వద్ద ఉన్న మొత్తం సొత్తును అమ్మేసి స్వస్థలానికి వెళ్లిపోవచ్చని భావించిన బాలకృష్ణ మార్కెట్ ప్రాంతం నుంచి బస్సులో మియాపూర్ వెళ్లాడు. అక్కడ ఇతడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్న దుండగులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కళ్లల్లో కారం చల్లి రూ.38.6 లక్షల విలువైన వజ్రాలు, ముత్యాలు, రంగురాళ్లు దోచుకున్నారు.
నానా కష్టాలుపడి ఫిర్యాదు...
ఈ షాక్ నుంచి కోలుకున్న బాలకృష్ణ అక్కడ నుంచి నేరుగా మార్కెట్ ప్రాంతంలో తాను బస చేసిన లాడ్జికి చేరుకున్నాడు. కాస్త తేరుకున్నాక కొందరి సాయంతో స్థానిక ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఓ పక్క భాష.. మరోపక్క పరిధి వంటి సమస్యలు రావడంతో నేరుగా ఉత్తర మండల డీసీపీ జయలక్ష్మిని కలిసి ఫిర్యాదు అందించారు. ఆమె ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్, మహంకాళి ఠాణాలకు చెందిన అధికారులతో పాటు కానిస్టేబుళ్లు స్వామి (మార్కెట్), శ్రీకాంత్ (చిలకలగూడ)లతో ఏర్పాటైన స్పెషల్‌టీమ్ సాంకేతిక ఆధారాల ద్వారా 18 రోజుల్లో నిందితుల్ని గుర్తించింది. బుధవారం మహేందర్, బాబు, శ్రీనివాసు, అన్వర్, రాజు, శ్రీధర్, శంకర్లను అరెస్టు చేసి దోపిడీకి గురైన సొత్తును రికవరీ చేసింది. ఈ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన డీసీపీ రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.