దొరికిపోతామనే లొంగుబాటు!
‘తనిష్క్’ చోరీలో రెండో నిందితుడి అరెస్ట్‌ను చూపిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్టలోని తనిష్క్ జ్యువెలరీ షో రూమ్‌లో భారీ దోపిడీకి పాల్పడిన రెండో నిందితుడు ఆనంద్‌ను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం వెల్లడించారు. భవనం వెనుక గోడకు వేసిన రంధ్రం ద్వారా దుకాణంలోకి ప్రవేశించి సొత్తును మూటకట్టింది ఇతడేనని గుర్తించినట్లు తెలిపారు. చోరీ సొత్తు నుంచి రెండు బంగారు గాజుల్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా కలకలం రేగడంతోనే నిందితులు లొంగిపోయారని పేర్కొన్నారు. పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.సత్తయ్య యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన అంశాలివీ..
- తనిష్క్ షోరూమ్‌లో చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఆనంద్ అయినా సూత్రధారి, ప్రేరేపించిన వ్యక్తి కిరణ్‌కుమారే.
- షోరూమ్‌కు ఉన్న వెనుక పైపు ‘పాత కిటికీ’ని పగులకొట్టడానికి 3 రోజుల్లో రెండు దఫాలుగా ఆనంద్ ప్రయత్నించాడు.
- శనివారం తెల్లవారుజామున షోరూమ్ నుంచి రూ.5.97 కోట్ల విలువైన 851 బంగారు ఆభరణాల్ని మూడు బ్యాగుల్లో సర్దుకున్న ఆనంద్ వాటిని చిన్న సందు ద్వారా ఓ తాడు సాయంతో కిరణ్‌కు అందించగా... అతడు పెద్ద బ్యాగ్‌లో పెట్టాడు.
- చోరీ సమయంలో ముఖం దాచుకున్నా కంటిపాపలు సీసీ కెమెరాల్లో రికార్డైతే వాటిని విశ్లేషిస్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా కళ్లజోడు ధరించాడు.
- తల వెంట్రుకలు రాలిపడితే డీఎన్ఏ ఆధారంగా గుర్తిస్తారనే భయంతో తలకు ప్రత్యేక జెల్ రాసుకున్నాడు.
- శని-ఆదివారాల్లో రెండు గాజులు, రెండు ఉంగరాలు అమ్మడానికి నిందితులు యత్నించారు.
- తమ ఇంటికి పొరుగున ఉండే పద్మ అనే మహిళ ద్వారా రెండు గాజుల్ని బేగంపేటలోని ఆనంద్ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్‌లో అమ్మేందుకు పంపారు.
- ఈ రెండు గాజులు ఒకే జతవి కాకపోవడం, అప్పటికే మీడియాలో ‘తనిష్క్’ వ్యవహారం వెలుగుచూడడంతో యజమాని వాటిని కొనేందుకు తిరస్కరించారు.
- దీంతో కంగుతిన్న పద్మ వెనక్కు వచ్చి ఆనంద్, కిరణ్‌లను నిలదీయడంతో ఇద్దరూ కంగారుపడ్డారు.
- ఈ పరిణామంతో సొత్తు అమ్మడం తేలికకాదు అని, కచ్చితంగా పోలీసులకు దొరికిపోతామనే భావన ఇద్దరికీ కలిగింది.
- 720 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాల్ని ఇచ్చి పారిపోవాల్సిందిగా కిరణ్... ఆనంద్‌కు చెప్పాడు. తర్వాత కిరణ్ మీడియా ద్వారా పోలీసులకు లొంగిపోయాడు. కిరణ్ అరెస్టు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆనంద్ కూడా మరో మీడియా ద్వారా పోలీసులకు లొంగిపోయాడు.