ఖజానా లావాదేవీలు బంద్ !
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని ఖజానా శాఖ ఆధ్వర్యంలోని సబ్ ట్రెజరీల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రభుత్వ మౌఖి క ఆదేశాలమేరకు ఆ శాఖ అధికారులు లావాదేవీలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రభుత్వ ఖజానాల ద్వారా ఎటువంటి బిల్లులు కానీ, చెక్కులు కానీ జారీకాలేదు. దీంతో బుధవారం ఒక్క రోజు రూ.మూడున్నర కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం నుంచి అన్ని రకాల బిల్లులనూ నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు, సంక్షిప్త సందేశాలు అందాయి. దీంతో తదుపరి సమాచారం వచ్చే వరకూ ఎక్కడి బిల్లులక్కడ ఆపేయాలని జిల్లాలోని అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలకూ ఖజానా శాఖ డీడీ పీవీ భోగారావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా లోని 14 సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి.
తెర్లాం వంటి కొన్ని సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో రోజుకు రూ. 15లక్షల వరకూ లావాదేవీలు జరుగుతుండగా, విజయనగరం తదితర సబ్‌ట్రెజరీల్లో రూ.50 లక్షల వరకూ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీల్లోగా జీతాల బిల్లులు అందజేస్తారు. ఆ తరువాత 1 వ తేదీ నుంచి సప్లిమెంటరీ, కంటింజెంట్, అడ్వాన్సులు, మెయింటెనెన్స్ బిల్లులు వెళ్తుంటాయి. జిల్లాలో 16 వేల మంది పెన్షనర్లు, 23వేల మంది ఉద్యోగుల బిల్లులు ప్రతీ నెలా వెళ్తుంటాయి. సామాజిక పెన్షన్ల లావాదేవీలు కూడా ట్రెజరీల ద్వారానే నిర్వహిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ బిల్లులన్నీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆగిపోయే పరిస్థితులున్నాయి. సుమారు నాలుగైదు రోజుల పాటు ఈ లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితులున్నాయని భావిస్తున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళన
మరో నాలుగు రోజుల పాటు బిల్లుల చెల్లింపు నిలిచిపోతే తమ జీతాలు, పెన్షన్ల పరిస్థితి ఏంటని ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బిల్లులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
ఆదేశాలు జారీ చేశాం
బిల్లుల చెల్లింపులు చేయవద్దని జిల్లాలో అన్ని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాలతోనే బిల్లులు నిలిపివేశాం. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ జిల్లాలోని ఏ ట్రెజరీలోనూ చెల్లింపులు జరగవు. ప్రస్తుతం వేతనాల బిల్లులన్నీ వెళ్లిపోయాయి. ఒకటో తేదీ తరువాతే బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున నిలిచిపోయే బిల్లులేవీ లేవు.
- పీవీ భోగారావు, డిప్యూటీ డైరక్టర్, (డెరైక్టర్) జిల్లా ఖజానా శాఖ, విజయనగరం.