ఎస్సీ హాస్టళ్లలో 4650 మందికి వసతి
చిగురుమామిడి : జిల్లాలోని 98 ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ విద్యాసంవత్సరం 4650 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెరిక యాదయ్య తెలిపారు. హరితహారంలో భాగంగా మంగళవారం మండలంలోని ఇందుర్తి ఎస్సీ బాలుర హాస్టల్లో మెుక్కలు నాటారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లలో విద్యార్థుల చేత మెుక్కలు నాటించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం విడుదల చేసిందని, వాటిని విద్యార్థులకు అందించాల్సి ఉందన్నారు. వసతిగృహాల్లో ప్రథమ చికిత్స మందులు పీహెచ్‌సీల నుంచే సరఫరా అవుతున్నాయన్నారు. బెడ్షీట్లు, దోమతెరలు రావాల్సి ఉందన్నారు. ప్రతి విద్యార్థికి రూ.500 నుంచి రూ.800 వరకు నోట్‌బుక్‌ల కింద అందిస్తున్నట్లు తెలిపారు. వసతిగృహాల నిర్వహణ చార్జీల బడ్జెట్ వచ్చినప్పటికీ ఇంకా విడుదల చేయలేదన్నారు. ఆయన వెంట ఏఎస్‌డబ్ల్యూవోలు వినోద్‌కుమార్, బాలసుందర్, ఎంపీటీసీ మొగిలి, ఉపసర్పంచ్ చింతపూల నరేందర్, హాస్టల్ వార్డెన్ వెంకట్రమణారెడ్డి పాల్గొన్నారు.