తేలిన నిధుల పంచాయితీ
* జెడ్పీటీసీలకు రెండొంతులు, ప్రజాప్రతినిధులకు ఒకొంతు వాటా
* ఎమ్మెల్సీలకు మొండిచేయి..
* రేపటితో ముగియనున్న ప్రతిపాదనల గడువు
* 25 మండలాలనుంచే అందిన ప్రతిపాదనలు
నల్లగొండ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల పంచాయితీ ఎట్టకేలకు తెగింది. ఈ పథకం కింద జిల్లాకు రూ.40 కోట్లు మంజూరైన విషయం విదితమే. అయితే ఈ నిధుల పంపకాల విషయమై గత నెల 10వ తేదీన జరిగిన జెడ్పీ పనుల స్థాయీ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనల మేరకు పనులు ప్రతిపాదించాలని, నిధుల కేటాయింపులు జరపాలని ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. దీనిని వ్యతిరేకించిన జెడ్పీటీసీలు ఆ విధంగా చేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని...అలా కాకుండా ఈ నిధుల్లో ముందుగా తమవాటా ఎంతో తేల్చాలని పట్టుబట్టారు. అయితే ఈ వివాదాన్ని సమావేశంలో కాకుండా బయట చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని అనుకున్నారు.
నిధుల్లో ఎవరికెంత వాటా ఇవ్వాలనే దానిపై పరస్పరం చర్చించిన తర్వాత 2:1 నిష్పత్తి ప్రకారం పంపకాలు చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం రూ.40 కోట్ల నిధుల్లో ఒక్కో జెడ్పీటీసీకి రూ.35 లక్షలు చొప్పున ఖరారు చేశారు. 59 జెడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులకుగాను రూ.21 కోట్ల 35 లక్షలు కేటాయించారు. ఇక ముగ్గురు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల 5 లక్షలు కేటాయించారు. మిగిలిన రూ.8.60 కోట్లు జెడ్పీ చైర్మన్ ఆధీనంలో ఉంచారు. మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిధులు కేటాయిస్తారు. ఈ పనుల ప్రతిపాదనలు పంపించే గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటికే 25 మండలాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.
సర్పంచ్ల తీర్మానంతోనే..
ఉపాధి హామీ నిబంధనల మేరకు పనుల ప్రతిపాదనలు సర్పం చ్ల తీర్మానంతోనే పంపించాల్సి ఉంటుంది. పనుల గుర్తింపు జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇష్టానుసారంగా జరి గినప్పటికీ సర్పంచ్ల ఆమోదంతోనే తీర్మానం చేయాలి. నిధులు కూడా సర్పంచ్ల ఖాతాల్లోకి వెళతాయి. 60:40 ప్రకారం నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే 60 కూలీలకు, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించారు. ఈ నిధులతో కల్వర్టులు, సీసీ రోడ్లు, మెటల్ రోడ్ల మరమ్మతులు, కొత్తగా మెటల్ రోడ్ల నిర్మాణం, రోడ్లకు ఇరువైపులా చెట్ల తొలగింపు, మట్టిరోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా మట్టి పోయడం వంటి పనులు చేపడతారు. జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధుల ఇష్టానుసారం పనులు జరిగే పరిస్థితి ఉండడంతో ఆ పనులు ఏవిధంగా జరుగుతాయనే దానిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.