జేబీ పట్నాయక్ కన్నుమూత
తిరుపతి స్విమ్స్‌లో గుండెపోటుతో మృతి
సంస్కృత విద్యాపీఠం స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చిన పట్నాయక్
అస్వస్థతకు కొద్ది గంటల ముందే శ్రీవారి దర్శనం
తిరుపతి: ఒడిశా మాజీ సీఎం జానకి బల్లభ పట్నాయక్(89) కన్నుమూశారు. కుటుంబ సభ్యులతో కలసి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 18వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుపతి వచ్చిన ఆయన.. మంగళవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాపీఠానికి చాన్స్‌లర్‌గా ఉన్న ఆయన సోమవారం సాయంత్రం ‘బహుభాషా ఉత్పత్తి’ పదకోశంపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుపతికి చేరుకుని సంస్కృత విద్యాపీఠం వర్సిటీ అతిథి గృహంలో మనుమడు అవినాష్‌తో కలిసి బస చేశారు. అర్ధరాత్రి దాటాక 1.30 ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో గంటన్నర పాటు వైద్యులు అత్యవసర చికిత్స చేసినా ఫలితం దక్కలేదు.
ఆయన భౌతికకాయాన్ని విద్యార్థుల సందర్శనార్థం సంస్కృత విద్యాపీఠానికి తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు తరలించారు. అక్కడ గవర్నర్ ఎస్సీ జమీర్, సీఎం నవీన్ పట్నాయక్, వివిధ పార్టీల నేతలు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. బుధవారం పూరీ స్వర్గద్వార్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శనంలో తమ తండ్రి స్వయంగా విష్ణు సహస్ర నామాలు గట్టిగా చదివారని పట్నాయక్ కుమార్తె సుదత్త తెలిపారు. ఆయన మృతికి నివాళిగా ఒడిశా ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మంగళవారం సెలవు ప్రకటించారు. సంస్కృత విద్యాపీఠంలో అధికార కార్యక్రమాలను రద్దు చేశారు. స్నాతకోత్సం రద్దయింది.
దేశం గొప్ప నేతను కోల్పోయింది: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: జేబీ పట్నాయక్ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని పట్నాయక్ భార్య జయంతికి సంతాప సందేశం పంపారు. పట్నాయక్ ఒడిశా అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సోనియాగాంధీ, రాహుల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, పట్నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.