కొడుకు పుట్టిన రోజు చేద్దాం లేవయ్యా
భర్త మృతితో కన్నీటి పర్యంతమైన భార్య
కేసముద్రం : ‘కొడుకు పుట్టిన రోజు తిరుపతిలో మంచిగ చేద్దామంటివి కదయ్యా.. టికెట్లు కూడా తెత్తివి ఒక్కసారి లేవయ్యా.. నీ కొడుకు డాడీ అని పిలుత్తండు’ అని భర్త మృతదేహంపై పడి ఆ ఇల్లాలు రోదిస్తున్న తీరు చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. కేసముద్రంవిలేజ్కు చెందిన రావుల ప్రవీణ్‌రెడ్డి(34) విద్యుదాఘాతంతో సోమవారం సాయంత్రం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల ప్రవీణ్‌రెడ్డి, అనూష దంపతులకు 11 నెలల బాబు ఉన్నాడు.
ప్రవీణ్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవైట్ కంపెనీ లో పనిచేస్తున్నాడు. దసరా పండుగకు స్వగ్రామానికి భార్యకుమారుడితో కలిసి వచ్చాడు. దీపావళి దగ్గరకు వస్తుండటంతోపాటు, ఈ నెల 27న కొడుకు మొదటి పుట్టిన రోజు కావడంతో తిరుపతి కొండపై స్వామివారి సన్నిధిలో ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకున్నాడు. తిరుపతి వెళ్లేందుకు కుటుంబ సభ్యులకు, మిత్రులకు టికెట్లు కూడా బుక్ చేశాడు. ఇంట్లో బంధువులను పిలిచి ఫలహారాలు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న మంచినీటి హౌస్‌లో నీటి సరఫరా కోసం బిగించిన మోటార్ స్విచ్ ఆన్ చేయగా పనిచేయలేదు.
అదే సమయంలో కరెంట్ పోయింది. దీంతో స్విచ్ బంద్ చేయడం మరిచారు. కొద్దిసేపటి తర్వాత మోటార్ రిపేర్ చేసేందుకు ప్రవీణ్‌రెడ్డి సంపులో కి ఇనుప నిచ్చెన వేసుకుని దిగాడు. అదే సమయంలో విద్యుత్ వైరు నీళ్లలో పడింది. ఇంతలో సాయంత్రం కరెంట్ రావడంతో ఆ విద్యుత్ తీగ ద్వారా విద్యుతఘాతానికి గురై ఇనుప నిచ్చెన మీదున్న అతడు సంపులో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భర్త కొట్టుమిట్టాడుతుండగా ఏం చేయాలో తోచక కేకలు వేస్తూ రోదించింది. ఇంతలో స్థానికులు స్విచ్ ఆఫ్ చేసినా అప్పటికే మృతిచెందాడు. భర్త మృతితో భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.