death lists
-
మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పాజిటివ్ వస్తే మృతుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి కాకుండా చేయొచ్చని చెప్పింది. లేకపోతే ఎందుకు చనిపోయాడో ఎప్పటికీ తెలియదని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. కరోనా వైద్యం చేసే వారికి వైద్య పరికరాలిచ్చేలా ఉత్త ర్వులు జారీ కోరుతూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ప్రాథమిక లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్లు తెలిసిందని, ఇది మంచి నిర్ణయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా లక్షణాలుం టేనే పరీక్షలు చేసే విధానానికి ఉన్న శాస్త్రీయత ఏమిటో చెప్పాలని కోరింది. లక్షణాలున్న వారితో సన్నిహితంగా ఉన్న వారికి, కుటుంబసభ్యులకూ పరీక్షలు చేస్తేనే వైరస్ వ్యాప్తి కట్టడికి వీలుంటుందని తేల్చి చెప్పింది. వీటితోపాటు మృతదేహాలకు పరీక్షలు నిర్వహించకపోతే కరోనా వ్యాప్తి లెక్కలు తేలవని, పైగా గణాంకాల గారడీతో జనాన్ని మభ్యపెట్టడమే అవుతుందని వ్యాఖ్యా నించింది. ప్రభుత్వం వాస్తవ పరిస్థితుల కోణంలో చూడాలని, మనల్ని మనమే మోసం చేసుకోవద్దని హితవు పలికింది. తొలుత పిటిషనర్ న్యాయవాది ప్రభాకర్ వాదిస్తూ.. జంటనగరాల్లోని 32 కంటైన్మెంట్ జోన్స్‌లోని వారికి పరీక్షలు నిర్వహించాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు విధుల్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మార్గదర్శకాల్లో ప్రాథమిక లక్షణాలున్నవారికే పరీక్షలు చేయాలని ఏమీ లేదని గుర్తు చేసింది. కరోనా వైరస్ అనుమానితులతో పాటు కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడమే కాకుండా క్వారంటైన్ సెంటర్స్‌కు పంపాలని మార్గదర్శకాల్లో ఉందని చెప్పింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశిస్తూ కోర్టు విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. -
చైనాపై పెరిగిన అనుమానాలు?
బీజింగ్: కరోనా వైరస్ పుట్టుక, కేసులు, మృతుల సంఖ్య వంటి అంశాల్లో అక్కడి ప్రభుత్వం చెబుతున్నవన్నీ వాస్తవాలేనా అన్న అనుమానాలు ఎప్పట్నుంచో ప్రపంచ దేశాలను వేధిస్తున్నాయి. ఆ అనుమానాలు మరింత బలపడేలా వూహాన్లో స్థానిక ప్రభుత్వం కోవిడ్ మరణాలను ఒకేసారి 1,290 ఎక్కువ చేసి జాబితాను సవరించింది. అంటే దాదాపుగా 50% ఎక్కువ మృతుల్ని చూపించింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 4,632కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్ని కూడా 325 పెంచింది. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 82,692కి చేరుకుంది. దీనిపై స్థానిక ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. వైరస్ విజృంభిస్తున్న తొలినాళ్లలో దాని కట్టడికి వ్యూహ రచన చేయడం, వైద్య సిబ్బందిని మోహరించడం వంటి పనుల్లో తీరిక లేకుండా గడపడం వల్ల గణాంకాల సేకరణ ఆలస్యమైందని వెల్లడించింది. మొదట్లో రోగులకు చికిత్స అందించలేక ఆస్పత్రులు కిటకిటలాడిపోయాయని, చాలా మంది ఇళ్లలోనే మృతి చెందారని తెలిపింది. కోవిడ్–19పై సమాచారాన్ని పారదర్శకంగా ఉంచేందుకే జాబితాను సవరించామని స్పష్టం చేసింది. -
మరణాలే లేవట!
జిల్లా ప్రజల ఆరోగ్యానికి ఢోకా లేదని ప్రభుత్వ యంత్రాంగంచెబుతోంది. గడిచిన నాలుగు నెలల్లో మలేరియా, డెంగీ,చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ఒక్కరూ మరణించలేదని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆయా వ్యాధులతో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఏటా టైఫాయిడ్, మలేరియా, డెంగీ, పచ్చకామెర్లతో పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. ఇలా మరణించే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇటీవలి కాలంలో పట్టణ ప్రాంతాల్లోనూ బాగా పెరిగింది. అపరిశుభ్రత, దోమల స్వైరవిహారం, కలుషిత తాగునీరు ఇందుకు ప్రధాన కారణాలు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ డబ్బంతా కాగితాలకే పరిమితం. క్షేత్రస్థాయిలో పరిశుభ్రత కనిపించడం లేదు. వేసవిలో తాగునీరు లభించక, ఉన్న నీరు కలుషితం కావడంతో డయేరియా(అతిసారం), ఎండతీవ్రతకు వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బొల్లవరం గ్రామంలో డయేరియాతో 16 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. స్థానికంగా తాగునీరు కలుషితం కావడం వల్లే ఇది జరిగిందని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వేసవి ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే వర్షాకాలంలో వైరస్లు విజృంభిస్తాయి. దీనికితోడు దోమలు స్వైర విహారం చేస్తాయి. ఈ దశలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులతో పాటు కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, పచ్చకామెర్ల వ్యాధులుపెరుగుతాయి. వైద్యం అందుబాటులో ఉండని గిరిజన ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. అయితే.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ఈ సీజన్లో మరణాలేవీ లేవని నివేదికలు ఇస్తోంది. ఏప్రిల్‌లో వడదెబ్బతో 12 మంది మృతి జిల్లాలో ఈ వేసవిలో ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే వడదెబ్బతో మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఒక్క ఏప్రిల్‌లోనే 12 మంది చనిపోయారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో మృతిచెందిన వారిలో బోయతిప్పన్న(ఆర్.కొంతలపాడు,కర్నూలు), చక్రనాయక్(సీతమ్మతండా, ప్యాపిలి), నాగన్న(ఇందిరానగర్, ఆదోని), తెలుగు గట్టన్న(ప్రాతకోట,పగిడ్యాల), మహ్మద్ షరీఫ్(కొత్తపేట, డోన్), రంజాన్‌సాబ్(రౌడూరు, కౌతాళం), మోహనకృష్ణ(క్రిష్ణగిరి), వి.భాస్కర్(నందివర్గం, బనగానపల్లి), శ్రీని వాసులు(దొర్నిపాడు), మండ్ల వెంకటేశ్వర్లు(భానుముక్కల, పాములపాడు), గిరిపోగుబాబు(హెచ్.కైరవాడి, గోనెగండ్ల), సుబ్బమ్మ(హోసూరు, పత్తికొండ), ఎర్రస్వామి(హోళగుంద) ఉన్నారు. వీరితో పాటు పచ్చకామెర్లతో సీహెచ్ కనకారెడ్డి(కర్నూలు), డెంగీతో లిఖిత(తాడూరు, డోన్), ఫిబ్రవరిలో డిప్తీరియాతో బీబీ మరణించారు. గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మలేరియాతోఒక్కరే మృతిచెందారని నివేదికలు పంపారు. వాస్తవాలు పంపితే ప్రభుత్వానికి చెడ్డపేరని... క్షేత్రస్థాయిలో జరుగుతున్న మరణాలపై వాస్తవంగా నివేదికలు తయారు చేసి పంపితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భయపడుతున్నారు. అందుకే జిల్లా అధికారులకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. కేసులు తక్కువ చేసి చూపించాలని పేర్కొన్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులతో పాటు సిబ్బంది కూడా సరిగా వెళ్లరన్న అపవాదు ఉంది.ఇటీవల జిల్లా అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయగా.. ఇదే విషయం బయటపడింది. వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో సిబ్బంది తమ పనితీరును మార్చుకోవడం లేదు. దీనికితోడు క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఈ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు గాను నివేదికల్లో మాయ చేస్తున్నారు. -
విపత్తుల జాబితాలోకి వడదెబ్బ మరణాలు!
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ మృతులను కూడా విపత్తు మరణాల జాబితాలో చేర్చి జాతీయ/రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ. 1.5 లక్షల సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5వ తేదీ మధ్య 1,377 మంది వడదెబ్బతో మృతిచెందారని, 2003 వేసవిలో మూడు వేల మంది వడదెబ్బతో చనిపోయారని, ఈ దృష్ట్యా వడదెబ్బ మరణాలను విపత్తుల కిందకు చేర్చాలని తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే చలిగాలి మరణాలు విపత్తుల జాబితాలో ఉన్నాయని, అలాగే వడదెబ్బను కూడా విపత్తుగానే పరిగణించాలని కోరారు.