బీజింగ్: కరోనా వైరస్ పుట్టుక, కేసులు, మృతుల సంఖ్య వంటి అంశాల్లో అక్కడి ప్రభుత్వం చెబుతున్నవన్నీ వాస్తవాలేనా అన్న అనుమానాలు ఎప్పట్నుంచో ప్రపంచ దేశాలను వేధిస్తున్నాయి. ఆ అనుమానాలు మరింత బలపడేలా వూహాన్‌లో స్థానిక ప్రభుత్వం కోవిడ్ మరణాలను ఒకేసారి 1,290 ఎక్కువ చేసి జాబితాను సవరించింది. అంటే దాదాపుగా 50% ఎక్కువ మృతుల్ని చూపించింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 4,632కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్ని కూడా 325 పెంచింది.
దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 82,692కి చేరుకుంది. దీనిపై స్థానిక ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. వైరస్ విజృంభిస్తున్న తొలినాళ్లలో దాని కట్టడికి వ్యూహ రచన చేయడం, వైద్య సిబ్బందిని మోహరించడం వంటి పనుల్లో తీరిక లేకుండా గడపడం వల్ల గణాంకాల సేకరణ ఆలస్యమైందని వెల్లడించింది. మొదట్లో రోగులకు చికిత్స అందించలేక ఆస్పత్రులు కిటకిటలాడిపోయాయని, చాలా మంది ఇళ్లలోనే మృతి చెందారని తెలిపింది. కోవిడ్–19పై సమాచారాన్ని పారదర్శకంగా ఉంచేందుకే జాబితాను సవరించామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment