జిల్లా ప్రజల ఆరోగ్యానికి ఢోకా లేదని ప్రభుత్వ యంత్రాంగంచెబుతోంది. గడిచిన నాలుగు నెలల్లో మలేరియా, డెంగీ,చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ఒక్కరూ మరణించలేదని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆయా వ్యాధులతో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు.
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఏటా టైఫాయిడ్, మలేరియా, డెంగీ, పచ్చకామెర్లతో పెద్దసంఖ్యలో చనిపోతున్నారు. ఇలా మరణించే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇటీవలి కాలంలో పట్టణ ప్రాంతాల్లోనూ బాగా పెరిగింది. అపరిశుభ్రత, దోమల స్వైరవిహారం, కలుషిత తాగునీరు ఇందుకు ప్రధాన కారణాలు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ డబ్బంతా కాగితాలకే పరిమితం. క్షేత్రస్థాయిలో పరిశుభ్రత కనిపించడం లేదు. వేసవిలో తాగునీరు లభించక, ఉన్న నీరు కలుషితం కావడంతో డయేరియా(అతిసారం), ఎండతీవ్రతకు వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం బొల్లవరం గ్రామంలో డయేరియాతో 16 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. స్థానికంగా తాగునీరు కలుషితం కావడం వల్లే ఇది జరిగిందని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వేసవి ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే వర్షాకాలంలో వైరస్‌లు విజృంభిస్తాయి. దీనికితోడు దోమలు స్వైర విహారం చేస్తాయి. ఈ దశలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులతో పాటు కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, పచ్చకామెర్ల వ్యాధులుపెరుగుతాయి. వైద్యం అందుబాటులో ఉండని గిరిజన ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. అయితే.. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం ఈ సీజన్‌లో మరణాలేవీ లేవని నివేదికలు ఇస్తోంది.
ఏప్రిల్‌లో వడదెబ్బతో 12 మంది మృతి
జిల్లాలో ఈ వేసవిలో ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే వడదెబ్బతో మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఒక్క ఏప్రిల్‌లోనే 12 మంది చనిపోయారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో మృతిచెందిన వారిలో బోయతిప్పన్న(ఆర్.కొంతలపాడు,కర్నూలు), చక్రనాయక్(సీతమ్మతండా, ప్యాపిలి), నాగన్న(ఇందిరానగర్, ఆదోని), తెలుగు గట్టన్న(ప్రాతకోట,పగిడ్యాల), మహ్మద్ షరీఫ్(కొత్తపేట, డోన్), రంజాన్‌సాబ్(రౌడూరు, కౌతాళం), మోహనకృష్ణ(క్రిష్ణగిరి), వి.భాస్కర్(నందివర్గం, బనగానపల్లి), శ్రీని వాసులు(దొర్నిపాడు), మండ్ల వెంకటేశ్వర్లు(భానుముక్కల, పాములపాడు), గిరిపోగుబాబు(హెచ్.కైరవాడి, గోనెగండ్ల), సుబ్బమ్మ(హోసూరు, పత్తికొండ), ఎర్రస్వామి(హోళగుంద) ఉన్నారు. వీరితో పాటు పచ్చకామెర్లతో సీహెచ్ కనకారెడ్డి(కర్నూలు), డెంగీతో లిఖిత(తాడూరు, డోన్), ఫిబ్రవరిలో డిప్తీరియాతో బీబీ మరణించారు. గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మలేరియాతోఒక్కరే మృతిచెందారని నివేదికలు పంపారు.
వాస్తవాలు పంపితే ప్రభుత్వానికి చెడ్డపేరని...
క్షేత్రస్థాయిలో జరుగుతున్న మరణాలపై వాస్తవంగా నివేదికలు తయారు చేసి పంపితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భయపడుతున్నారు. అందుకే జిల్లా అధికారులకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. కేసులు తక్కువ చేసి చూపించాలని పేర్కొన్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులతో పాటు సిబ్బంది కూడా సరిగా వెళ్లరన్న అపవాదు ఉంది.ఇటీవల జిల్లా అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయగా.. ఇదే విషయం బయటపడింది. వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో సిబ్బంది తమ పనితీరును మార్చుకోవడం లేదు. దీనికితోడు క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఈ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు గాను నివేదికల్లో మాయ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment