death sentenced
-
సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై హత్యాచారం కేసులో దోషికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. నిందితుడు చేసిన నేరం తీవ్రమైనదిగా పరిగణించి ఊరి శిక్షను ఖరారు చేసింది.కాగా, బీహార్‌కు చెందిన గఫార్ అలీ.. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే కారణంగా కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి ఆమెను హత్యచేశాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గఫార్ అలీని దోషిగా నిర్ధారించింది. బాలికపై హత్యాచారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంగారెడ్డి కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. ఇక, ఈ ఘటన జరిగిన 11 నెలలు అవుతోంది. తక్కువ సమయంలోనే దోషికి ఉరిశిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణ శిక్ష విధించారు. ఇది కూడా చదవండి: స్థానికత రిజర్వేషన్: సుప్రీంకు తెలంగాణ సర్కార్ -
త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయికి ఉరి
ప్రొద్దుటూరు క్రైం: త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయి కరీముల్లాకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివసించే ఉప్పలూరు చాంద్‌బాషా, గుల్జార్‌బేగం దంపతులకు ఓ కుమార్తె (కరీమున్నీసా), ముగ్గురు కుమారులు(కరీముల్లా, మహబూబ్‌బాషా, మహ్మద్ రఫీ). రఫీ మినహా ఇద్దరు కుమారులు, కుమార్తెకు పెళ్లిళ్లు అయ్యాయి. కరీముల్లా గతంలో తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. అయితే అతను కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో.. తల్లిదండ్రులు పక్క వీధిలో వేరే కాపురం పెట్టించారు. ఆ సమయంలో కొందరి చెప్పుడు మాటలు విన్న కరీముల్లా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనపై నింద వేయడంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కరీముల్లా మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాడు. గర్భిణి అయిన చెల్లెలు కరీమున్నీసా కూడా పుట్టింటికి వచ్చింది. భార్యతో విడాకులు ఇప్పించాలని కరీముల్లా అడుగుతుండగా.. తల్లిదండ్రులు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో 2021 ఏప్రిల్ 25వ తేదీన కరీముల్లా కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజు(26వ తేదీ) తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న తల్లి గుల్జార్‌బేగం, చెల్లి కరీమున్నీసా, తమ్ముడు రఫీని కరీముల్లా రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా.. ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. ముగ్గురిని తానే హత్య చేశానని కరీముల్లా అంగీకరించడం.. నేరం రుజువు కావడంతో జడ్జి జి.రమేశ్‌బాబు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు కోర్టు చరిత్రలో ఇది మొదటి ఉరిశిక్ష తీర్పు అని ఏపీపీ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
డాక్టర్ హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నరాల వైద్యనిపుణుడు సుబ్బయ్యను చెన్నైలో హతమార్చిన కేసులో ఏడుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ విధిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. శిక్ష పడినవారిలో ప్రొఫెసర్ దంపతులు, వారి కుమారులు ఉండడం గమనార్హం. వివరాలు..తమిళనాడు, కన్యాకుమారి జిల్లా సామితోప్పునకు చెందిన ప్రభుత్వ డాక్టర్ సుబ్బయ్య 2013 సెప్టెంబర్ 9న చెన్నై రాజాఅన్నామలైçపురంలోని తన క్లినిక్ బయట దాడికి గురై 23న ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. హతుడు సుబ్బయ్య మేనమామ పెరుమాళ్ తన సోదరికి (సుబ్బయ్య తల్లికి) కన్యాకుమారీ జిల్లా అంజుగ్రామంలోని స్థలాన్ని ఇచ్చారు. దీన్ని సమీప బంధువులు ఆక్రమించుకున్నారు. కొన్ని కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని దక్కించుకోవాలని ఇరువర్గాలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. స్థల వివాదం మూడు తరాలుగా నడుస్తూ తీవ్రస్థాయికి చేరుకుంది. 2013లో ఉద్యోగవిరమణ పొందిన డాక్టర్ సుబ్బయ్య న్యాయస్థానం ద్వారా బంధువులపై పోరాడి ఆ స్థలాన్ని దక్కించుకున్నాడు. ఇందుకు కక్షకట్టిన బంధువులు కిరాయి గూండాల సహకారంతో చెన్నైలోని క్లినిక్ వద్ద డాక్టర్ సుబ్బయ్యను దారుణంగా హత్యచేశారు. ఈ కేసులో మేనమామ రెండో భార్య కుమారుడైన ప్రొఫెసర్ పొన్నుస్వామి, అతని భార్య ప్రొఫెసర్ మేరీ పుష్పం, వీరి కుమారులైన న్యాయవాది ఫాసిల్, ఇంజినీర్ బోరిస్‌తోపాటూ న్యాయవాది విల్సన్, ప్రభుత్వ డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్, మురుగన్, సెల్వప్రకాష్, అయ్యప్పన్.. ఈ పదిమందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో అయ్యప్పన్ అప్రూవర్‌గా మారిపోయాడు. మొత్తం పది మంది నిందితుల్లో 9 మంది దోషులని నిర్ధారణైనట్లు చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. పొన్నుస్వామి, న్యాయవాది ఫాజిల్, విలియం, డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, ఇంజనీర్ బేరిస్, మురుగన్, సెల్వప్రకాష్‌లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మేరి పుష్పం, కిరాయి గూండాల్లోని కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన పొన్నుస్వామి, అతని కుమారులు ఫాజిల్, బోరిస్‌లకు ఉరిశిక్ష పడడం గమనార్హం. అప్రూవర్‌గా మారి కేసు విచారణకు సహకరించిన అయ్యప్పన్‌ను కోర్టు విడిచిపెట్టింది. -
మైనర్‌పై అత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష
సాక్షి, బెంగళూరు : అన్నెం పున్నెం ఎరుగని బాలికపై కోలారు జిల్లాలో వృద్ధుడు పంజా విసిరాడు. కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న అమ్మాయిపై ఇద్దరు దుండగులు అకృత్యానికి పాల్పడి ప్రాణాలు తీశారు. ఈ రెండు కేసుల్లో దోషులకు న్యాయపీఠాలు ఉరిశిక్షను విధిస్తూ తీర్పు చెప్పాయి. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 65 యేళ్ల వృద్ధునికి మరణ శిక్షను విధిస్తూ కోలారు రెండవ సెషన్స్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తాలూకాలోని భైరండహళ్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప శిక్షకు గురైన వ్యక్తి. వెంకటేశప్ప 2018 మే నెల 1వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకు వెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై వేమగల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు వెంకటేశప్పపై పోక్సో కేసు దాఖలు చేశారు. విచారణంలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి బిఎస్ రేఖ ఈ మేరకు తీర్పును వెలువరించారు. శృంగేరిలో విద్యార్థినిపై హత్యాచారం కేసులో.. చిక్కమగళూరు జిల్లా శృంగేరిలో కాలేజీ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కేసులో ఇద్దరు దోషులకు చిక్కమగళూరు ప్రత్యేక కోర్టు మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. 2016 ఫిబ్రవరి 16న శృంగేరి తాలూకా మెణసె గ్రామానికి చెందిన కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు నిందితులు అత్యాచారం చేసి హత్య చేశారు. పాడుబడిన బావిలో మృతదేహాన్ని పడేసి పరారయ్యారు. విద్యార్థిని మంగళూరులో పీయుసీ పరీక్ష రాసి బస్‌లో మెణసెకీ వచ్చింది. అక్కడ నుండి నడిచి వెళ్లుతుండగా ఆదే ఊరుకు చెందిన సంతోష్, ప్రదీప్‌లు విద్యార్థిని నోరుమూసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అఘయిత్యానికి ఒడిగట్టి ప్రాణం తీశారు. ఈ సంఘటనను గుర్తించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే గ్రామానికి చెందిన సంతోష్, ప్రదీప్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసి అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారించిన చిక్కమగళూరు ప్రత్యేక జడ్జి ఎం.ఉమేశ్ అడిగ.. నిందితులు ఈ ఘోరం చేసినట్లు నిరూపణ కావడంతో శనివారం పై విధంగా తీర్పు వెలువరించారు. కాగా ఈ ఘాతుకంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాలు ఆందోళనలు నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. -
ప్రొఫెసర్‌కు మరణశిక్ష; పాక్‌ను అభ్యర్థించిన ఐరాస
సాక్షి, ఇస్లామాబాద్ : దైవ దూషణ ఆరోపణలపై ప్రొఫెసర్‌కు మరణ శిక్ష విధించడాన్ని ఐరాస మానవ హక్కుల కమిషన్ పాకిస్తాన్‌ను తప్పుపట్టింది. మరణశిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అపహాస్యమైనదిగా పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ప్రొఫెసర్ జునైద్ హఫీజ్‌కు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, హైకోర్టు న్యాయమూర్తులు హఫీజ్‌ను నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అసాధారణ కేసులలో మాత్రమే మరణ శిక్ష విధించాలని, లేకపోతే తిరుగులేని సాక్ష్యం అయినా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. హఫీజ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు కనుక శిక్షను అమలు చేయడమంటే ఈ చర్య ఏకపక్ష నిర్ణయంతో పాటు అంతర్జాతీయ చట్టానికి విరుద్దమని వారు తెలిపారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను చట్టబద్ధంగా వినియోగించే వ్యక్తులకు దైవ దూషణ చట్టాలు అడ్డంకిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, హఫీజ్‌ను ఐరాస మత స్వేచ్ఛా కమిషన్ ప్రపంచ బాధితుల జాబితాలో చేర్చింది. 2013లో మహమ్మద్ ప్రవక్తపై ప్రొఫెసర్ జునైద్ హఫీజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మిలిటెంట్ ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన విద్యార్థులు ఆరోపించారు. 95 శాతం ముస్లింల జనాభా ఉన్న పాకిస్తాన్లో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఉదారవాద, లౌకిక అభిప్రాయాలు కలిగిన హఫీజ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అతని తరపు న్యాయవాది ఆరోపించారు. అంతకు ముందు 2014లో హఫీజ్ తరపున వాదించడానికి అంగీకరించిన న్యాయవాది రషీద్ రెహ్మీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా నిందితులుగా పేర్కొనలేదు. చదవండి : పాక్ : దైవదూషణ కేసులో ప్రొఫెసర్‌కు మరణశిక్ష -
ఘోరకలి.. ఉరి తీసేశారు
టోక్యో: జపాన్ చరిత్రలో ఘోర కలిగా ముద్ర పడిపోయిన ‘టోక్యో సరిన్ దాడి’ నిందితులందరికీ ఉరిశిక్ష అమలైంది. రెండు దశాబ్దాల క్రితం ఓమ్ షిన్రిక్యో మత అనుచరులు రసాయనిక దాడులకు పాల్పడి 13 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురికి గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేసేశారు. ఈ దారుణ ఘటన ప్రధాన సూత్రధారి, ఓమ్ షిన్రిక్యో (Aum Shinrikyo) వర్గ గురువు ‘షోకో అసహారా’ను, మరో ఆరుగురు నిందితులను ఏ నెల మొదట్లో ఉరి తీసిన విషయం విదితమే. సరిన్ దాడి: 1984 షోకో అసహారా(అంధుడు).. ఓమ్ షిన్రిక్యో అనే మతాన్ని నెలకొల్పి వేల సంఖ్యలో అనుచరులను తయారు చేసుకున్నాడు. ప్రపంచం అంతమైపోతుందన్న షోకో ప్రవచనల ప్రేరణతో.. ఓమ్ షిన్రిక్యో అనుచర గణం మారణ హోమానికి యత్నించింది. 1995 మార్చిలో టోక్యోలోని 'సబ్వే'లో ఆరు రైళ్లలో ఒకేసారి రసాయనిక దాడులకు పాల్పడింది. అత్యంత విషపూరిత 'సరిన్' వాయువును వదలటంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 6 వేల మంది క్షతగాత్రులయ్యారు. అప్పట్లో ఈ దాడులు సంచలనంగా మారాయి. అసహారా ఆదేశాల మేరకు అతడి అనుచరులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలటంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మౌంట్ ఫుజీలోని షోకో ప్రధానాశ్రమం మీద దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆపై విదేశాలకు పారిపోతున్న షోకో, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు షోకో మరియు ఆయన అనుచరులు ‘సరిన్ విషప్రయోగం’ ద్వారానే ఓ లాయర్ కుటుంబాన్ని హతమార్చారన్న ఆరోపణలు కూడా రుజువయ్యాయి. దీంతో ఆయా కేసుల్లో దోషులుగా తేలటంతో అసహారా, అతని అనుచరులకు ఉరిశిక్ష విధిస్తూ 2004లో కోర్టు తీర్పునిచ్చింది. మరణ శిక్ష రద్దుపై జపాన్‌లో మిమాంస కొనసాగుతున్న తరుణంలో.. దోషులకు శిక్ష అమలు ఇన్నేళ్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరకు ‘సరిన్ దాడి బాధిత కుటుంబాల’ ఒత్తిడి మేరకు ప్రభుత్వం.. వారికి శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల మొదట్లో(జూలై6) అసహారా సహా ఏడుగురు సభ్యులకు మరణశిక్ష అమలు చేసినట్లు జపాన్ న్యాయశాఖ అధికారి వెల్లడించారు. ఇప్పుడు మిగిలిన ఆరుగురికి శిక్ష అమలు చేయటంతో ఈ కేసులో నిందితులందరినీ ఉరి తీసినట్లయ్యింది. అతిపెద్ద విషాదం.. 900 మంది సూసైడ్ -
బంగ్లాదేశ్ మీడియా దిగ్గజం ఖాసిం అలీకి ఉరిశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ మీడియా దిగ్గజం, జమాతే ఇస్లామీ పార్టీ అగ్రనేత మీర్ ఖాసిం అలీ(62)కి ఢాకాలోని యుద్ధ నేరాల ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ప్రకటించింది. 1971లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అమానుషాలకు పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరించింది.