అదనపు వడ్డీ కట్టలేదని వివస్త్రను చేసి..
పట్నా: సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణ ఘటన బిహార్‌లో జరిగింది. ఆపదలో అక్కరకొస్తాయని రూ.1,500 అప్పు తీసుకున్న పాపానికి దళిత మహిళ ఒకరు దారుణ అవమానానికి గురికావాల్సి వచి్చంది. విషయం తెల్సి నిందితులకు కఠిన శిక్ష పడేలాచూడాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోలీసులను ఆదేశించారు. బిహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఖుస్రూపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి జరిగింది.
కొన్ని నెలల క్రితం దళిత మహిళ భర్త.. ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1,500 అప్పుగా తీసుకున్నారు. తర్వాత కొంతకాలానికి వడ్డీతోసహా అసలు మొత్తాన్నీ ప్రమోద్‌కు చెల్లించేశారు. ఇది సరిపోదని, ఇంకా అదనంగా వడ్డీ కట్టాలని ప్రమోద్ వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా ఇచ్చేదేమీలేదని దళిత వ్యక్తి భార్య కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆమెకు ఫోన్ చేసి ‘ అదనపు వడ్డీ కట్టకపోతే నిన్ను నగ్నంగా ఊరిలో ఊరేగిస్తా’ అంటూ ప్రమోద్ చేసిన బెదిరింపులను ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికొచ్చి విచారించి వెళ్లారు. పోలీసులు వచి్చన విషయం తెల్సి ప్రమోద్ కోపంతో ఊగిపోయాడు. ఈనెల 23వ తేదీన రాత్రి పదింటికి కొంత మందితో కలిసి దళితుడి ఇంటికొచ్చి అతిని భార్యను బలవంతంగా తన ఇంటికి లాక్కెళ్లాడు. వివస్త్రను చేసి పిడిగుద్దులు కురిపిస్తూ కర్రలతో చావబాదాడు. ప్రమోద్ కుమారుడు అన్షుతో ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ మళ్లీ పోలీసులుకు ఫిర్యాదుచేసింది. ప్రమోద్, కుమారుడు అన్షు పరారీలో ఉన్నారని పట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు.