యూరోజోన్ నిర్ణయంతో మార్కెట్ల జోరు
ఏథెన్స్: గ్రీస్ ఒప్పందానికి యూరోజోన్ నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించిందనే వార్తలతో ప్రపంచ మార్కెట్లు పాజిటివ్గా స్పందించాయి. ముఖ్యంగా భారత మార్కెట్లు లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా, నేషనల్ స్టాక్ఎక్సేంజ్ నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయి 8450 దాటింది. యూరోపియన్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. డాక్స్, కాక్స్ సహా మిగిలిన యూరోపియన్ మార్కెట్లు రెండు శాతం లాభాలను సాధించాయి.
కాగా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీకి యూరో జోన్ ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం మూడో ఉద్దీపన ప్యాకేజీకి ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్టు ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. గ్రీసుకు బెయిలవుట్ ప్యాకేజీ సిద్ధంగా ఉందని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ప్యాకేజీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం అప్పుడే అమల్లోకి రాదని గ్రీక్ కార్మికమంత్రి ప్రకటించారు.