అప్పుల సెగ.. దళారుల దగా
కవిటి : కోనసీమ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో కొబ్బరి సాగు చేస్తున్న కవిటి ఉద్దానం రైతులు మూడు తుపాన్లు.. ఆరు గండాలతో కుదేలవుతున్నారు. దళారుల దగా కారణంగా పంటకు తగిన ఆదాయం లభించక అప్పులభారంతో కుంగిపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు వర్తించదని స్పష్టం కావడంతో బ్యాంకుల అప్పులు, వాటిపై వడ్డీలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అప్పు తీర్చమని బ్యాంకర్ల నుంచి తాఖీదులు అందుతుండటంతో లక్ష రుణానికి రూ. 10 వేలకు పైగా వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. రుణం తీరాలన్నా, రెన్యూవల్ చేయించుకోవాలన్నాకొబ్బరికాయల దిగుబడిపై వచ్చే ఆదాయమే ఆధారం.
అయితే ధర గిట్టుబాటు కాని పరిస్థితుల్లో అనివార్యంగా ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుందని దిగులు చెందుతున్నారు. 1998లో వచ్చిన సూపర్ సైక్లోన్, 2013లో వచ్చిన పై-లీన్, 2014లో వచ్చిన హూద్‌హుద్ తుపాన్లన్నీ కొబ్బరి రైతుల వెన్ను విరిచాయి. కష్టకాలంలో ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు చేతులెత్తేయడం, ఇదే సమయంలో దిగుబడులు తగ్గిపోవడం, ధర రాకపోవడం రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
దిగుబడి లేదు.. ధరా రాదు
వరుస తుపాన్లు, ఇతర వైపరీత్యాలతో కొబ్బరి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. అందిన కొద్దిపాటి పంటకైనా గిట్టుబాటు ధర వస్తుందనుకుంటే.. దళారులు, వ్యాపారులు కలిసి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ప్రస్తుతం ఉద్దానంలో ఎకరాకు 4 నుంచి 5 పణాలు(400 కొబ్బరి కాయలు) చొప్పున సగటు దిగుబడి వస్తోంది. దీన్ని ప్రస్తుతం ఒడిశా వ్యాపారులు రు.8000 నుంచి రూ.8500 వరకు కొనుగోలు చేస్తున్నారు. డ్రిప్ పథకం ఉన్న తోటల్లో పండిన కొబ్బరికి మరో రు.600 వరకు అదనంగా చెల్లిస్తున్నారు. అయితే వీరికి ఒక పణం(80) కాయలకు ముదరాగా 5 కాయలు ఇవ్వాల్సి వస్తోంది.
పణం ధర రూ.640 ఉంటే అందులో రు.40 ముదరా కింద వ్యాపారికి ఇచ్చేయాల్సి వస్తోంది. అ లెక్కన ఒక కాయ ధర ఎనిమిది రూపాయలు పడుతోంది. అదే కాయను బయట మార్కెట్లలోనూ, దేవాలయాల వద్ద రు.15 నుంచి రూ.18కి అమ్ముతున్నారు. ఇందులో దాదాపు సగమే రైతుకు అందుతోంది. మిగిలిన సగం వ్యాపారులు, దళారుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇదే కాకుండా 2వేల కాయలు రైతు నుంచి కొనాలంటే లారీ కాయలు(సైడ్) అనే పేరుతో వ్యాపారులు మరో 20 కాయలు వెనుకేసుకుంటారు. లారీ కాయలు ఏమిటి అంటే.. లోడ్‌తో లారీ బయలుదేరిన చోటు నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రతి సెంటర్లో దేవుడి పేరిట లారీ ఎదురుగా కొబ్బరికాయలు కొడతామని చెబుతారు.
వాస్తవానికి లారీ లోడ్ అయిన తర్వాత బయలుదేరే సమయంలో మాత్రమే ఒక కాయ కొడతారు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో నీరందించే తోటల తోపాటు సాధారణ తోటల్లోని కాయ సైజు భారీగా, నాణ్యంగానే ఉంటున్నా వ్యాపారుల దందాతో రైతులు నష్టపోతున్నారు. ఈ రకంగా 50 పణాల దిగుబడి సాధించిన రైతు 200 కొబ్బరికాయలు..అంటే రూ.1600 ముదరాగా వదులుకోవాల్సి వస్తోంది.
ఉద్దానం నుంచి రోజుకు ఐదారు లారీల కొబ్బరికాయలు ఒడిశాకు రవాణా అవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ముదరా పేరుతోనే వ్యాపారులు రోజుకు రు.16వేల వరకు అప్పనంగా ఆర్జిస్తున్నారు. కాగా కొందరు దళారులు తాము ఇంకా తక్కువ ధరకు కాయలు ఇప్పిస్తామంటూ ఒడిశా వ్యాపారులను ఆకట్టుకొని రైతులకు తక్కువ ధర ముట్టజెబుతున్నారు. దీనిపై ప్రభుత్వపరంగా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు దగాపడుతున్నారు.