debts problem
-
తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని కట్టేసి కొట్టారు!
కొమరాడ: అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపి గ్రామస్తుల నుంచి భారీగా అప్పులు చేసింది. ఆ సొమ్ముతో జల్సాలు చేసింది. చివరకు అప్పులు తీర్చలేనంటూ చేతులెత్తేయడంతో బాధితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రచ్చబండ వద్ద తాడుతో కట్టేసి కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సివిని గ్రామానికి చెందిన శోభ గత కొన్ని రోజులుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అధికంగా వడ్డీలు ఇస్తానంటూ గ్రామస్తుల నుంచి సుమారుగా రూ.1.40 కోట్ల మేర అప్పుచేసింది. డబ్బు తిరిగివ్వాలంటూ వారంతా అడిగేసరికి చేతులెత్తేసింది. దీంతో ఏప్రిల్ 7న కొమరాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం కొంత మంది బాధిత మహిళలు, గ్రామస్తులు కలిసి ఆమెను రామమందిరం వద్ద ఉన్న రచ్చబండ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆమెను విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ ప్రయోగమూర్తి చెప్పారు. -
రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా.. కిటికీలు తెరిచి చూస్తే...
కలికిరి(చిత్తూరు జిల్లా): అప్పుల మోత అధికమై రెండు కుటుంబాలు మూడో కంటికి తెలియకుండా ఇంటి సామాన్లను తీసుకుని పరారయ్యాయి. గురువారం రాత్రి కలికిరిలో ఇది వెలుగులోకి రావడంతో కలకలం రేపింది. బాధితుల కథనం...స్థానికంగా స్వీట్స్ దుకాణం నిర్వహిస్తున్న ఖాదర్ బాషా, ఏ వన్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు కామున్నీషా, కరంతుల్లా పట్టణంలో పలువురి వద్ద అప్పులు చేశారు. గత శుక్రవారం నుంచి ఖాదర్ బాషా, దంపతులైన కామున్నీషా, కరంతుల్లా ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో రుణదాతలు అనుమానించారు. చదవండి: కట్నం వేధింపులకు నవ వధువు బలి గురువారం సాయంత్రం వారి ఇళ్ల కిటికీలు తెరచి చూశారు. ఇంట్లో వస్తువులేవీ పోవడంతో రెండు కుటుంబాల వారు పరారైనట్లు గుర్తించి కంగుతిన్నారు. పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసి లబోదిబోమన్నారు. ఎస్ఐ లోకేష్‌రెడ్డి దాదాపు 20 మంది బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. రాత్రి వరకు అందిన ఫిర్యాదుల మేరకు నిందితులకు రూ.1.6కోట్ల అప్పులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. కలికిరితో పాటు చింతపర్తి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారి నుంచి సుమారు రూ.3కోట్లకు పైగా నిందితులు అప్పులు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదలా ఉంచితే, కలికిరిలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వరుసగా మోసాలు వెలుగు చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
హుస్నాబాద్‌లో విషాదఛాయలు
సాక్షి, కరీంనగర్‌క్రైం: ఐదేళ్ల క్రితం జీవనోపాధి కోసం కరీంనగర్ పట్టణానికి వెళ్లిన కుటుంబ సభ్యులు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో హుస్నాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. హుస్నాబాద్ పట్టణానికి చెందిన అందె సమ్మయ్య కృష్ణవేణి దంపతులు ఐదేళ్ల నుంచి జీవనోపాధి కోసం కరీంనగర్ వెళ్లారు. అప్పుల బాధతో ఆదివారం రాత్రి ఇంట్లో దంపతులతోపాటు కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ పట్టణానికి చెందిన అందె సమ్మయ్య(38)కు కూచనపెల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి(35)తో పన్నెండేళ్ల కిందట వివాహం జరిగింది. కొద్దిరోజులు హుస్నాబాద్‌లో జీవనం సాగించిన వీరు జీవనోపాధి కోసం ఐదేళ్ల క్రితం కరీంనగర్‌కు వలస వెళ్లారు. అక్కడ అద్దె గదిలో ఉంటూ సమ్మయ్య మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చేసిన అప్పులు రూ.14లక్షలను తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసి దంపతులిద్దరు పురుగుల మందును ఆహారంలో తీసుకొని, కుమారుడు లక్కీ(10)కి కూడా ఇచ్చారు. చదవండి: (ఫీజు చెల్లించలేక తనువు చాలించింది) ఆహారం తీసుకొని నిద్రపోయిన దంపతులు ఇద్దరు సోమవారం తెల్లవారుజామున చావుబతుకుల మధ్యన కొట్టుకుండటం చూసిన కుమారుడు డయల్ 100కు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సమ్మయ్య, కృష్ణవేణి దంపతులు ఇద్దరు మృతి చెందగా, కుమారుడు లక్కీ ప్రమాదం నుంచి బయటపడ్డట్లు తెలిపారు. ఈ సంఘటన కరీంనగర్లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనతో కృష్ణవేణి తల్లిగారు ఊరు అయిన కూచనపెల్లిలో, సమ్మయ్య సొంత ఇల్లు ఉండే హుస్నాబాద్ గాంధీ చౌరస్తాలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని బాలుడికి భవిష్యత్ చూపించాలని రెండు గ్రామాల గ్రామస్తులు కోరుతున్నారు. -
‘గులాబీ’ గుబులు..అప్పుల తిప్పలు
జైనథ్(ఆదిలాబాద్): పంట నష్టంతో మనస్తాపం చెందిన మండలంలోని పెండల్వాడ గ్రామానికి చెందిన రైతు బొల్లి రమేశ్ (40) పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుల్లయ్య కథనం ప్రకారం.. రమేశ్ తల్లి పేరిట 5 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం 9 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. సాగు కోసం రూ.లక్ష బ్యాంకు అప్పు, మరో లక్ష ప్రైవేటు అప్పు ఉంది. ప్రస్తుతం పంటలో అక్కడక్కడ గులాబీరంగు పురుగు కనిపించడంతో గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. పురుగు ఉధృతి పెరిగితే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాదనే దిగాలుతో శుక్రవారం రాత్రి ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలాపూర్ వరకు ఆటోలో తీసుకొని రాగా, అక్కడి నుంచి 108లో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య నామమ్మ, ఇద్దరు కుమారు ఉన్నారు. కాగా మృతుడి తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. భీమిని(బెల్లంపల్లి): భీమిని మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు చౌదరి దేవాజీ(45) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం..దేవాజీ కొన్నేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. గతేడాది పంట దిగుబడి సరిగా రాలేదు. ఈ ఏడాది కూడా నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. అలాగే కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు అన్ని కలుపుకొని సుమారు రూ.3 లక్షలు అప్పులయ్యాడు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. దేవాజీకి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ముత్తారం: కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం మైదంబండకు చెందిన బియ్యాని మల్లయ్య(37) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్యకు రెండెకరాల భూమి ఉంది. కొంతకాలం క్రితం మరో రెండెకరాలు కొనుగోలు చేశాడు. సాగునీటి కోసం భూమిలో కొత్తగా వ్యవసాయ బావి తవ్వించాడు. ఈ ఏడాది ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో భూమి కొనుగోలు, బావి తవ్వకానికి అయిన అప్పు రూ.1 లక్షకు చేరింది. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో ఆదివారం చేనులోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్యకు భార్య తిరుమల, కుమారులు రాజ్‌కుమార్, అనిల్ ఉన్నారు.