నిజాం షుగర్స్ కథ కంచికి..
రూ. 4.27 కోట్ల మేర పేరుకుపోయిన వేతన బకాయిలు
చెరుకు రవాణా రాయితీ రూ. 6 కోట్ల కోసం ఎదురుచూపు
బీఐఎఫ్ఆర్కు నివేదించి చేతులు దులుపుకొన్న ఎన్డీఎస్ఎల్
కార్యదర్శుల కమిటీ నివేదిక పేరిట కాలయాపన చేస్తున్న సర్కార్
హైదరాబాద్: నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 క్రషింగ్ సీజన్లో చెరుకు గానుగను నిలిపివేసిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో లే ఆఫ్‌ను ప్రకటించిన యాజమాన్యం.. కార్మికుల వేతన బకాయిలు రూ. 4.27 కోట్లు కూడా చెల్లించడం లేదు. రైతులకు నష్టం వాటిల్లకుండా.. ఫ్యాక్టరీ పరిధిలో సాగైన చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలించి గానుగ ఆడించారు. చెరుకు తరలింపులో భాగంగా రవాణాకు సంబంధించి ప్రభుత్వం ఇస్తామన్న రాయితీ మొత్తం రూ. 6 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావడం లేదు. ఇదిలావుంటే.. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి, వరుస నష్టాలతో ఫ్యాక్టరీని నడిపించే పరిస్థితిలో లేనందున.. ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చాలంటూ ఎన్డీఎస్ఎల్ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం) ఇటీవల పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ మండలిని (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించింది. అయితే డీపీఎం అభ్యర్థనను మాత్రమే బీఐఎఫ్ఆర్ నమోదు చేసుకుంది. ఎన్ డీఎస్ఎల్ను ఖాయిలా పరిశ్రమగా గుర్తిస్తేనే.. అప్పుల చెల్లింపు, ఫ్యాక్టరీ తిరిగి తెరిచే అంశం తెరమీదకు వస్తుంది.
కార్యదర్శుల కమిటీ పరిశీలనలోనే టేకోవర్ అంశం
ఎన్డీఎస్ఎల్ను టేకోవర్ చేసే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ నివేదిక గత ఏడాది ఆగస్టులోనే సమర్పించాల్సి ఉంది. ఎస్బీఐ కాప్స్ అనే సంస్థకు ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పుల మదింపు బాధ్యతను కార్యదర్శుల కమిటీ అప్పగించింది. ఎస్బీఐ కాప్స్ నివేదిక సమర్పించినా.. టేకోవర్ అం శం ఇంకా కార్యదర్శుల కమిటీ పరిశీల నలోనే ఉన్నట్లు ప్రభుత్వం చెప్తోంది. దీంతో ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకోవడం అసాధ్యమని స్పష్టమవుతోంది.