deceased mother
-
బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్
కోనేరుసెంటర్(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం సామవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి ప్రశాంతి (23) ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. మచిలీపట్నం పరాసుపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. పరాసుపేటలోని ఓ స్కూల్లో పని చేసే తన బావ రాజేష్‌తో ఇటీవల ఆమెకు వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. (చదవండి: అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..) ఈ క్రమంలో గురువారం ప్రశాంతి రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి యజమాని మచిలీపట్నం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బందరు డీఎస్పీ మాసూంభాషా, చిలకలపూడి సీఐ అంకబాబు వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మచిలీపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఏఆర్ విభాగం అధికారులు, తోటి సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. చదవండి: జవాన్‌ను మింగేసిన మంచు -
పెళ్లైన 23 ఏళ్లకు తల్లి అయ్యింది.. అంతలోనే ప్రాణాలొదిలింది
కోరుట్ల: పెళ్లి అయిన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరినా 15 రోజులకే అవి ఆవిరయ్యాయి. ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది ఓ తల్లి. తనివితీరా బిడ్డలను చూసుకోకముందే తనువు చాలించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్‌కు చెందిన పొన్నం స్వరూప (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు. పెళ్లి అయి 23 ఏళ్లు అయినా వారికి సంతానంలేదు. సంతానం కోసం ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం ఫలించి పది నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. జూలై 19న ఆమె మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్ద రు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే వారిద్దరినీ అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళ్లింది. తన పిల్లలతో ఆనందంగా గడపకముందే ఇన్ఫెక్షన్తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్‌లోనే మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. -
తల్లి మృతిచెందిన రెండో రోజే తనయుడు మృతి
టేకులపల్లి(ఖమ్మం) : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన సర్పంచ్ తనయుడు సోమవారం రాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తడికలపూడి పంచాయతీ పరిధిలోని కోక్యాతండాకు చెందిన బానోతు నీల తీవ్ర జ్వరంతో ఈనెల 4న మృతిచెందిన విషయం విదితమే. తల్లి మరణంతోపాటే పెద్ద కొడుకు సురేష్‌కుమార్(21) అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఖమ్మం తరలించగా.. జన్యులోపం వల్ల సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న అతడికి రక్త మార్పిడీ చేయిస్తున్నారు. ఇటీవలే బీటెక్ పూర్తి పూర్తి చేసిన అతడు ఎంటెక్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉండి పరీక్షకు శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో తల్లి అస్వస్థతకు గురికావడంతో వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం తల్లి మృతిచెందడంతో అంత్యక్రియల కోసం సురేష్‌ను ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. తర్వాత అస్వస్థతకు గురైన సురేష్‌ను ఖమ్మం తరలించగా.. పరిస్థితి విషమించడంతో సోమవారం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా.. తల్లీ, సోదరుడు కళ్లముందే మృతిచెందడంతో తమ్ముడు కల్యాణ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇతడికి కూడా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉండటం గమనార్హం.