'బాబరీ వల్లే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లింది'
ఈ దేశంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం ఏమిటి? ఉత్తరప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల మంత్రి ఆజమ్ ఖాన్ ప్రకారం బాబరీ కట్టడాన్ని కూల్చేయడమే దీనికి కారణం. ఆదివారం ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆజమ్ ఖాన్ ఏకె 47, ఆర్ డీ ఎక్స్ పంటి పదాలను అంతకు ముందు ఎవరూ వినలేదని, బాబరీ కట్టడం కూల్చి వేసిన తరువాతే ఇవన్నీ తెరపైకి వచ్చాయని ఆయన అన్నారు.
మసీదు కూల్చడానికి ముందు హిందూ ముస్లింల మధ్య ఎలాంటి విద్వేషాలూ లేవని, అసలు గొడవంతా డిసెంబర్ 6, 1992 నుంచే మొదలైందని ఆజమ్ ఖాన్ అన్నారు. అయోధ్యకు అయిదు కి.మీ దూరంలో ఉండే ఫైజాబాద్ లో ఆజమ్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గతంలో ఆజమ్ ఖాన్ భారత మాత ఒక రాక్షసి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై చాలా దుమారమే చెలరేగింది. అయితే ఆజమ్ ఖాన్ తన వ్యాఖ్యలను ఇప్పటి వరకూ ఉపసంహరించుకోలేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కి ఆజమ్ ఖాన్ అత్యంత సన్నిహితుడు.