ఎక్కడ ఫెడ్ రేట్లు అక్కడే కానీ..
పెట్టుబడిదారులు ఎంతో నిశితంగా పరిశీలించిన ఫెడ్ రిజర్వు రేట్ల ప్రకటన వెలువడింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. కానీ అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెంది, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే డిసెంబర్లో వడ్డీరేట్లను పెంచుతామనే సంకేతాలను ఫెడరల్ రిజర్వు వెలువరిచింది. బుధవారంతో ముగిసిన రెండు రోజుల ఫెడ్ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది.
అమెరికా ఎన్నికలు ఇంకా వారమైనా గడువు లేనిపక్షంలో, ఈ సమయంలో వడ్డీరేట్లను ఆ దేశ రిజర్వుబ్యాంకు మార్పులు చేయదని మార్కెట్ విశ్లేషకులు ముందస్తుగానే అంచనావేశారు. వారి అంచనాలకు అనుగుణంగానే వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడ్ రిజర్వు తెలిపింది. ఇప్పటికే అమెరికా ఎన్నికల ప్రకంపనాలతో ప్రపంచమార్కెట్లన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీనికి తోడు ఫెడ్ రేట్లను పెంచితే మరింత మార్కెట్లు క్షీణించే అవకాశాలుండేవని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
అయితే అమెరికా ఆర్థికవ్యవస్థ లాభపడిందని, ఉద్యోగాల వృద్ధి మాత్రం అలా స్థిరంగా ఉండిపోయిందని అమెరికా సెంట్రల్ బ్యాంకు రేట్ సెట్టింగ్ కమిటీ తెలిపింది. వారు నిర్దేశించిన ద్రవ్యోల్బణం 2 శాతం టార్గెట్ సాధించే దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పయనిస్తుందనే దానికి సంకేతంగా మరింత ఆశావాదం కావాలని పాలసీమేకర్స్ వ్యక్తంచేశారు. దీనికోసం మరికొన్ని రోజులు వేచిచూస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మిడ్ డిసెంబర్లో జరిగే పాలసీ మీటింగ్లో రేట్లపెంపు ఉండొచ్చనే సంకేతాలను ఇచ్చారు.
వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు చేసిన ప్రకటనతో అమెరికా మార్కెట్లు కిందకి దిగజారాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 52.32 పాయింట్లు, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 11.29 పాయింట్లు, నాస్డాక్ కాంపొజిట్ 40.60 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున్న ఆ దేశ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.