ded exam
-
కన్నీటి పరీక్ష
– సోదరి మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన డీఈడీ విద్యార్థిని రాయచోటి రూరల్ : రాయచోటి జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన డీఈడీ విద్యార్థిని ఎన్.లక్ష్మి పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్ష ప్రారంభం అవుతున్న సమయానికి స్వగ్రామం మడకశిరలో తన సోదరి నాగవేణి అనారోగ్యంతో మృతి చెందిందనే వార్త తెలిసింది. దీంతో లక్ష్మి కన్నీరు మున్నీరైంది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె పరీక్ష రాసింది. పరీక్షా కేంద్రం చీఫ్ ఆఫీసర్ నాగముణిరెడ్డి ఆమెను ఓదార్చారు. పరీక్ష ముగిసిన అనంతరం మరుసటి రోజు ఆదివారం సెలవు కావడంతో లక్ష్మి బయలుదేరి స్వగ్రామానికి వెళ్లింది. -
పరీక్ష రాసి పెళ్లిపీటల మీదకు..
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం సరస్వతీనగర్‌కు చెందిన ఆలూరి రచన పెళ్లి శుక్రవారం ఉదయం 11.07 గంటలకు ఆదిలాబాద్‌లోని ఓ గార్డెన్లో ఉంది. ఆమె డీఎడ్ చదువుతోంది. ఇదే రోజు ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో డీఎడ్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో రచన తన తల్లిదండ్రులను ఒప్పించి మెథడాలజీ పరీక్షకు హాజరైంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉండగా.. 11 గంటలకు పరీక్ష ముగించుకుని బయటకు వచ్చింది. ఆ తర్వాత పెళ్లి కుమారుడు వెటర్నరీ డాక్టర్ సాగర్‌తో పెళ్లి జరిగింది. త్వరలో ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించే అవకాశాలు ఉండడంతో పరీక్షకు హాజరైనట్లు పెళ్లికూతురు రచన పేర్కొంది. -
‘డీఎడ్’ పరీక్ష ఫీజు 15లోగా చెల్లించాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎడ్ ద్వితీయ సంవత్సరం(2014–16 బ్యాచ్) విద్యార్థులు ఈ నెల 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు 16న ట్రెజరీలో జమ చేయాలని, 17న నామినల్‌రోల్స్ చలానాలు డీఈఓకు అందజేయాలని సూచించారు. అలాగే రూ. 50 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, 23న ట్రెజరీలో జమ చేయాలని, 24న నామినల్‌రోల్స్ చలానాలు డీఈఓకు అందజేయాలని సూచించారు. ఫీజుల వివరాలు ఇలా.. రెగ్యులర్ విద్యార్థులు రూ. 250, ప్రైవేట్ విద్యార్థులు 4,5 సబ్జెక్టులకు రూ. 250, మూడు సబ్జెక్టులకు రూ. 175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ. 125 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నామినల్ రోల్స్, చలానాలు గతంలో పరీక్షల డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్‌లో అందజేసేవారని, ఈ ఏడాది డీఈఓ కార్యాలయంలోనే అందజేయాలని సూచించారు.