కనులు చూడలేని ప్రపంచం
దేడ్ కహానీ - బ్లాక్
‘‘కళ్లున్న ప్రతి వాళ్లూ కలలు కంటారు-’’ అని టీచర్ క్లాసులో పాఠం చెబుతోంది. విద్యార్థులంతా శ్రద్ధగా వింటున్నారు. అంతలో హా అని ఒక గర్జనతో కూడిన అరుపు వినిపించింది. మిచెల్ అనే అంధ విద్యార్థిని. మతిస్థిమితం, వినికిడి శక్తి కూడా సరిగాలేని ఆమెని మనిషిగా మలచిన టీచర్ దేవరాజ్ సహాయ్ ఆమెకి ట్రాన్స్‌లేటర్‌గా క్లాస్‌రూమ్‌లో పక్కనే కూర్చుని ఉన్నాడు. సహాయ్ వల్లే మిచెల్ అందరు పిల్లల్తోపాటు గ్రాడ్యుయేషన్ వరకూ వచ్చింది.
‘నో’ అని అర్థం వచ్చేలా ఆమె అరిచిన అరుపుకి పాఠం చెప్తున్న టీచరు, వింటున్న పిల్లలు, పక్కనే కూర్చున్న సహాయ్ అందరూ ఉలిక్కిపడి ఆమెవైపు చూశారు. మిచెల్, సహాయ్ చేయి పట్టుకుని ఏదో సంజ్ఞ చేసింది. సహాయ్ టీచర్‌తో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పాడు. ‘‘మీరు చెప్పిన విషయంతో నేను ఏకీభవించను అంటోంది టీచర్’’.
టీచర్ మిచెల్‌ని నించోమంది. తన అభ్యంతరం ఏమిటో చెప్పమంది. మిచెల్ ఆంగికంతో అభినయం చేస్తుంటే సహాయ్ వాచికంతో చెప్పాడు - ‘‘కళ్లున్నవాళ్లు మాత్రమే కలలు కంటారన్నది తప్పు. కళ్లున్నవాళ్లు బయటి ప్రపంచాన్ని మాత్రమే చూస్తారు. కానీ, మనసున్నవాళ్లు లోపల మరో ప్రపంచాన్ని చూస్తారు. కలల్ని మనసుతో మాత్రమే చూడగలం. కళ్లు మూసుకున్నాకే మనసు తలుపులు తెరుచుకుని కలలు బైటకొస్తాయి. నాకు కళ్లు లేవు. కానీ నేను రోజూ కలలు కంటాను. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడతాను’’ అంది మిచెల్. టీచర్‌తో సహా అందరూ చప్పట్లు కొట్టారు - ఆ సన్నివేశాన్ని థియేటర్లో చూస్తున్న ప్రేక్షకులతో సహా.
ఒక పెద్ద బంగ్లా. మిచెల్ చెల్లెలి నిశ్చి తార్థం. పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, మిచెల్, ఆమె చెల్లెలు, వాళ్ల తల్లిదండ్రులు, మిచెల్ ట్రాన్స్‌లేటర్ కమ్ టీచర్ సహాయ్.. అందరూ భోజనాలకి కూర్చున్నారు. మిచెల్ చెల్లెలు అందరినీ ఉద్దేశించి మాట్లా డటం ప్రారంభించింది. నాకీ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి. చాలా ఏళ్లుగా చెప్పుకోలేని విషయాలున్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఆరేళ్ల వయసున్నప్పుడు నేను, మిచెల్ ఆడు కుంటూ పరుగెత్తాం.
ఇద్దరం కిందపడ్డాం. ఇద్దరమూ ఏడ్చాం. అమ్మ, నాన్న ఇద్దరూ కంగారుగా గార్డెన్‌లోకి వచ్చారు. మిచెల్‌ని ఎత్తుకున్నారు. ఊరడిస్తూ లోపలికి తీసు కెళ్లారు. నాకూ దెబ్బతగిలింది. ఎత్తుకో మని చేతులు చాపి ఏడుస్తున్నాను. కానీ ఎత్తుకోలేదు ఆ దెబ్బ ఇంకా మానలేదు. ఇవాళ్టికీ అలాగే ఉంది. నేనూ చేతులు జాపి హత్తుకోమని అలాగే ఉన్నాను. ఇప్పటికీ అమ్మ, నాన్న మిచెల్‌ని కంటికి రెప్పలా చూస్తూనే ఉన్నారు. అన్నీ సవ్యంగా ఉండి, అందంగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. అమ్మానాన్నల ప్రేమను అక్క మిచెల్ మాత్రమే పొందింది.
అది అదృష్టవంతురాలు. తల్లి దండ్రుల ప్రేమకి నోచు కోని నేను నిజ మైన వికలాంగురాలిని’’ - ఈ ప్రసంగం మొత్తాన్నీ సహాయ్ సంజ్ఞల ద్వారా మిచెల్‌కి అనువదిస్తూనే ఉన్నాడు. ఆమెలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. చెల్లెల్ని తనెంత ప్రేమించిందో ఆమె రాసుకున్న ప్రసంగాన్ని సహాయ్కిచ్చింది. అతను చదివి వినిపించాడు. చుట్టూ ఉన్న పాత్ర లన్నీ, నిందించిన చెల్లెలితో సహా కన్నీళ్లు పెట్టుకున్నాయి - ఈ దృశ్యం చూస్తున్న మనలాంటి ప్రేక్షకులతో సహా.
అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు చూసి చెప్పమన్నారు. నేను రెండు మెతుకులు శాంపిల్ చూపించాను. ఉడికిందా? మనసు తడిసిందా? కడుపు నిండా, గుండె నిండా ఆ అనుభూతిని అనుభవించాలని ఉందా? అయితే సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘బ్లాక్’ చిత్రం చూసెయ్యాల్సిందే. 2005లో విడుదలైన ఈ చిత్రం ‘ఎ’ సెంటర్లలో కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, 2 నేషనల్ అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుని రికార్డులు సృష్టించింది.
మానసిక అపరిపక్వత, అంగవైకల్యం జీవితంలో ఎదగడానికో, అనుకున్నది సాధించడానికో అవరోధాలు కాదు అని నమ్మిన సహాయ్ (అమితాబ్), మిచెల్ అనే చిన్న పాపకి ట్యూటర్‌గా చేరతాడు. ఆమె కన్నుల్లో అంధకారాన్ని ఏమీ చేయలేకపోయినా, లోపలున్న అంధకారాన్ని తొలగించి, ఆత్మజ్యోతిని అతడు వెలి గించడమే ఇతివృత్తం.
అసహనం, చిరాకు కలగలిసిన ఓ తాగుబోతు సహాయ్. మిచెల్ (రాణీముఖర్జీ)ని ఆమె కుటుంబ సభ్యులు, సభ్యసమాజం ఒక విక లాంగురాలిగా, మతిస్థిమితం లేని దానిగా సానుభూతితో చూడకుండా, ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్ లా చూడాలని తాపత్రయపడటం, అతని సహాయంతో మిచెల్ తన వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ఎదిగిన వైనం చూసి తీరాల్సిందే. అంధురాలిగా రాణీముఖర్జీ, ఆమె ఉన్నతికై తాపత్రయపడే సహాయ్గా అమితాబ్ బచ్చన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటాయి.
నిజానికి రాణీముఖర్జీ ప్రొఫెషనల్ అండ్ సీజన్డ్ ఆర్టిస్ట్. ఆమె బాగా చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్ననాటి మిచెల్గా నటించిన బాలనటి ఆయేషా కపూర్ కూడా రాణీ అంత బాగా చేయడం విశేషం. ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలని ముందు చిన్ననాటి పాత్రయే ప్రేక్షకులకి రుచి చూపిస్తుంది కాబట్టి ఆమె రాణించడం పెద్ద సవాలు. ఆ సవాలును స్వీకరించి చక్కగా సక్సెస్ సాధించింది ఆయేషా కపూర్. అలా ఆమెకి రెండు మార్కులు ఎక్కువే వేయొచ్చు.
అయితే వీళ్లందరితో ఇంత బాగా చేయించిన ఘనత మాత్రం దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీదే. ఆయన ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం! ఈ చిత్రంలోనే కాదు... చిత్ర నిర్మాణం వెనుక కూడా కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని... పాత్ర చాలా చాలెంజింగ్‌గా ఉంది కాబట్టి దానికి న్యాయం చేయగలనో లేదో అని రాణీముఖర్జీ ఈ పాత్రని ఒప్పుకోవ డానికి మొదట చాలా తటపటా యించిందట. ఈ చిత్రానికి ముందు ఎ.ఆర్.రెహ్మాన్‌ని సంగీత దర్శకుడిగా అనుకున్నారట. కానీ ఆ సమయానికి ఆయనకి ఖాళీ లేక మాంటీశర్మని ఫిక్స్ అయ్యారట.
ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (రిషికపూర్ కొడుకు), ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కపూర్ (అనిల్‌కపూర్ కూతురు) ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయ దర్శకులుగా పనిచేశార్ట. హెలెన్ కెల్లెర్ ఆత్మకథని చదివి, ఆమె ఇన్స్టిట్యూట్కి వెళ్లి ఇంకొంత రీసెర్చ్ చేసి సంజయ్‌లీలా భన్సాలీ ఈ కథని తయారుచేసుకున్నాట్ట. 2013లో టర్కీ భాషలో ‘బెనిమ్ డున్యమ్’ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు.
ఇలాంటి ఎన్ని విశేషాలు ఉన్నా... ఈ చిత్రం ద్వారా భన్సాలీ ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం తర్వాతే ఏదయినా. మానసి కంగా అయినా, శారీరకంగా అయినా వైకల్యాన్ని జయిస్తే కైవల్యం సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని అందమైన దృశ్య రూపంలో చూపించిన ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే!
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు