అతలాకుతలం
వరంగల్, న్యూస్‌లైన్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం తో జిల్లా అతలాకుతలమవుతోంది. రికార్డు స్థాయిలో వర్షం కురవగా... వరద పోటెత్తిం ది. వర్షం ధాటికి జిల్లావ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. కల్వర్టులు, రోడ్లు తెగి పోగా... చెరువులకు గండ్లు పడ్డాయి. ఇళ్లు నేలమట్టం కావడంతోపాటు వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. పంటలన్నీ నీటిలో కొట్టుకుపోగా... లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లు కూలడంతో ఓ వృద్ధురాలు మృత్యువాత పడగా... ఎని మిది మందికి గాయాలయ్యాయి. 20 మేక లు, రెండు ఆవులు వర్షానికి బలయ్యాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనాలను దారి మళ్లించారు.
ఇల్లు కూలి వృద్ధురాలి మృత్యువాత
ఉర్సుగుట్టలోని ప్రతాప్‌నగర్‌లో ఇల్లు కూలడంతో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు దిడ్డి రాధ(58) మృత్యువాత పడింది. ఆమె మనవడు మూడేళ్ల బాబు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలు కాగా అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తొర్రూర్-గోపాల్పూర్ మధ్య పొంగుతున్న వాగులో ఏడేళ్ల బాలుడు యశ్వంత్ గల్లంతయ్యాడు. నగరంలోని ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం రాత్రి వరదలో చిక్కుకున్న బాలింత వీరమనేని దివ్యతోపాటు ఆమె ఏడు రోజుల బాబు, వృద్ధురాలు రాజ్యలక్ష్మిని అధికారులు శనివారం ఉదయం సురక్షితంగా రక్షించారు.
బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్ల శివారులోని గోపాలపురంలో శనివారం ఉదయం ఇల్లు కూలి ఐదుగురు గాయపడ్డారు. వల్లాల శివరాములు, సత్యలక్షి, శిరీష, శ్రీకాంత్, ఉమకు గాయాలు కావడంతో వారిని జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నర్మెటలో ఇల్లు కూలి ప్రజ్ఞాపురం కనుకయ్య, అంజ య్యకు గాయాలయ్యాయి. స్టేషన్ ఘన్పూర్ మండలం లింగంపల్లిలో వీరనేని ఆగమయ్యకు చెందిన కొట్టం కూలడంతో 14 మేకలు మృత్యువాత పడ్డాయి.
తెగిన రోడ్లు..
కొడకండ్ల మండల కేంద్రంలోని మైదం చెరువు మత్తడిపోయగా... వరదలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మియాపూర్ డిపో బస్సు చిక్కుకుంది. అందు లో ఉన్న 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎటూ 5కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలి పోగా... మధ్యాహ్నం 2 గంటల తర్వాత వరద ఉధృతి తగ్గడంతో అధికారులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రామవరం వద్ద పాత చెరువు మత్తడి పడడంతో కాజ్వే వద్ద ఓ బైక్ కొట్టుకుపోయింది. సంగెం మండలం కుంటపల్లి వద్ద చెరువుకు బుంగ పడింది. దేవరుప్పుల-కడవెండి ప్రధాన రహదారి తెగిపోవడంతో ఏడు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. స్టేషన్ ఘన్పూర్ మండలం కాశికొండ-కిష్టాయిగూడెం వద్ద రోడ్డు తెగిపోయింది.
లింగపల్లి వద్ద కాజ్‌వేపైకి భారీగా నీరు చేరడంతో చిన్న పెండ్యాలతోపాటు పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పర్వతగిరి మండలం కల్లెడ పెద్ద చెరువుకు గండి పడింది. వుహేశ్వరం నుంచి గురిజాలకు వెళ్లే రహదారిపై వరద పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయుం ఏర్పడింది. చెన్నారావుపేట వుండలం గురిజాలలోని రెండు చెరువులు, వుుగ్ధుంపురం, అమీనాబాద్ చెరువులు వుత్తడి పోస్తున్నాయి. నల్లబె ల్లి మండలం రుద్రగూడెంలోని ఎర్రకుంట చెరువుకు గండిపడింది. వర్ధన్నపేట ఆకేరు వాగు పొంగి పొర్లుతుండగా... కోనారెడ్డి చెరువులోకి భారీగా నీరు చేరుతోంది. పున్నేలు చెరువు, డీసీతండ శివారు జగన్నాయకుంటకు బుంగలు పడ్డాయి. మడికొండలో ఇళ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు అవస్థలకు గురయ్యారు.
హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ శివారులో కాజ్వే వద్ద వరద నీరు పొంగి ప్రవహించడంతో ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. సీతంపేట శివారులో రోడ్డు తెగిపోయింది. మునిపల్లి-చింతగట్టు వద్ద లోలెవల్ వంతెన తెగిపోవడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూయి. అన్నసాగర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిట్యాల మండలం నైన్పాక-చైన్పాక మధ్య కల్వర్టుపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తుండడంతో అలుగు తండా, వెంచరామి వరకు సంబంధాలు తెగిపోయాయి. ఒడిశెల- గోపాల్పూర్ వద్ద చెరువు అలుగు పడడంతో కొత్తపల్లి, దూద్‌పల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
పొంగుతున్న వాగులు
భూపాలపల్లి వద్ద మోరంచ, కలివాగులు పొంగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూయి. ధర్మారావుపేట-గణపురం వద్ద మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 21 గ్రామాలను సం బంధాలు తెగిపోయూయి. ములుగు ప్రాంతంలోని దస్రుమాటు, బొగ్గులవాగు, ఏటూరునాగారం వద్ద దొడ్లవాగు, జంపన్నవాగు పొంగి ప్రపవహిస్తుండడంతో 13 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. మహబూబాబాద్ వద్ద నడివాగు పొంగడంతో లోలెవల్ వంతెనపై నీరు చేరింది. దీంతో అధికారులు వాహనాలను నిలిపివేశారు. పాకాల, లక్నవరం, రామప్ప, ఘన్పూర్, ధర్మసాగర్, బొమ్మకూర్ రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో రిజర్వాయర్లన్నీ నిండుకుండలా మారాయి. రామప్ప సరుస్సు అలుగు పోస్తోంది.
నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యూయి. ఎస్ఆర్నగర్, సాయిగణేష్‌కాలనీ, వివేకానందకాలనీ, జేఎంజే కాలనీ, శాంతినగర్, పద్మానగర్, ఎంహెచ్‌నగర్, వీవర్స్‌కాలనీ, దేశాయిపేట, హంటర్‌రోడ్డు, సమ్మయ్యనగర్ ప్రాంతా ల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. హంటర్‌రోడ్డులోని జూపార్క్ ఎదురుగా రోడ్డు తెగడం, వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. హన్మకొండ, వరంగల్, కాజీపేటలోని ప్రధాన దారులన్నీ వరద నీటితో నిండిపోయాయి.
గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం నీటమునగగా... సర్క్యూట్ గెస్ట్‌హౌస్ వద్ద ఆడిట్ కార్యాలయం పైకప్పు కూలింది. ఆర్ఈసీ విద్యుత్ సబ్‌స్టేషన్ మొత్తం నీటితో నిండడంతో కరెంట్ సరఫరా నిలిపేశారు. శివనగర్‌లోని ఆర్‌ఎస్‌నగర్, మైసయ్య నగర్, పోచమ్మనగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అక్కడ జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శివనగర్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 250 మందికి పునరావాసం కల్పించారు.