నాణ్యత ప్రశ్నించాడని బదిలీ వేటు!
తాడిపత్రి, న్యూస్‌లైన్: అనంతపురం-భోగసముద్రం ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం.. టెండర్ల దశ నుంచి పనుల ప్రారంభం వరకు అత్యంత వివాదాస్పదంగా మారింది. టెండర్ల ఖరారులో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ మంత్రి జోక్యం చేసుకోవడం వల్ల 2009లో ప్రారంభం కావాల్సిన పనులు ఆలస్యమయ్యాయి.
రూ.200 కోట్ల అంచనా వ్యయంతో భోగసముద్రం నుంచి అనంతపురం వరకు ఎట్టకేలకు ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించిన కంట్రాక్టర్ తనకున్న రాజకీయ అనుబంధంతో అనుకులంగా ఉన్న అధికారులను మాత్రమే సబ్‌డివిజన్‌లో పనిచేసే విధంగా చేసుకుంటున్నాడు. తన మాట వినని, అనుకూలంగా లేని వారిని ఏకంగా బదిలీ చేయించే పనిలో పడ్డాడు. ఇటీవల పనుల నాణ్యత విషయంలో అడ్డుచెప్పడంతోపాటు ఉన్నతాధికారులకు నివేదికలు పంపే విషయంలో విభేదించిన తాడిపత్రి డీఈఈ చంద్రశేఖర్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి డీఈఈని అనంతపురానికి బదిలీ చేయిస్తూ ముఖ్యమంత్రి పేషీ నుంచి ఈ నెల 18న ఉత్తర్వులు (జీఓఆర్టీ 1147) జారీ చేయించాడు.
తనకు కావాల్సిన, అనుకూలమైన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ జిల్లా గాలివీడులో డీఈఈ శ్రీరామమూర్తిని తాడిపత్రికి నియమించేలా అదేశాలు జారీ చేయించాడు. తనను అక్రమంగా బదిలీ చేశారని చంద్రశేఖరరెడ్డి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో బదిలీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయంపై ఈ రహదారి నిర్మాణ సంస్థ ఆర్.ఎస్.ఇన్ఫాస్ట్రక్చర్ ప్రతినిధి రామకృష్ణారెడ్డిని న్యూస్‌లైన్ సంప్రదించగా.. పరిపాలనాపరమైన కారణాలతోనే డీఈఈ బదిలీ అయ్యారని చెప్పారు. ఆయనపై తమకెలాంటి కక్షసాధింపు లేదన్నారు.